బీజేపీలో చేరికపై సచిన్ పైలట్ క్లారిటీ

  • Published By: venkaiahnaidu ,Published On : July 15, 2020 / 03:26 PM IST
బీజేపీలో చేరికపై సచిన్ పైలట్ క్లారిటీ

కాంగ్రెస్ కు  వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసిన తరువాత తన రాజకీయ భవిష్యత్తు గురించి అనేక ఊహాగానాలు వచ్చాయని, తాను బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయని, అయితే తాను బీజేపీలో చేరడం లేదని సచిన్ పైలట్ పునరుద్ఘాటించారు. సచిన్ పైలట్…జ్యోతిరాదిత్య సింధియాను అనుసరించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. అయితే తనకు అలాంటి ఉద్దేశాలు లేవని,తాను ఇప్పటికీ కాంగ్రెస్ సభ్యుడిని అని అయన తెలిపారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీపై పోరాడి గెలిచామ‌ని, ఇప్పుడు తానెందుకు బీజేపీలో చేరాల‌ని పైల‌ట్ ప్ర‌శ్నించారు. తాను బీజేపీలో చేరుతున్న‌ట్లు ఓ త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని ఆయ‌న అన్నారు.

రాజ‌స్థాన్ మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్‌ కు .. కాంగ్రెస్ పార్టీ అన‌ర్హ‌త నోటీసులు జారీ చేసింది.పైల‌ట్‌తో పాటు ఆయ‌న‌తో ఉన్న ఇత‌ర ఎమ్మెల్యేల‌కు కూడా పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న ఆరోప‌ణ‌ల‌పై నోటీసులు జారీ చేశారు. అసెంబ్లీ స్పీక‌ర్ మొత్తం 19 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ స‌మావేశాల‌కు హాజ‌రు కానందున్న వ‌ల్ల అన‌ర్హ‌త వేటు వేస్తున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పింది.

సచిన్​ పైలట్​ను రాజస్థాన్​ డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా తొలగించినట్లు కాంగ్రెస్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సచిన్ పైలట్ వెంట ఉన్నవిశ్వేందర్ సింగ్, రమేష్ మీనాలను మంత్రి పదవుల నుంచి నుంచి తొలగించారు. సచిన్ పైలట్ స్థానంలో గోవింద్ సింగ్ దోతస్రా‌ను కొత్త పీసీసీ,డిప్యూటీ సీఎంగా నియమించారు.

ముందుగానే పసిగట్టాం

మరో వైపు, రాజ‌స్థాన్‌లో రాజ‌కీయ సంక్షోభానికి ముందు జ‌రిగిన ప‌రిణామాల‌పై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అశోక్‌గెహ్లాట్ స్పందించారు. త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు త‌మ పార్టీ నేత‌ల‌కే ఎర‌వేశార‌ని ఆయన ఆరోపించారు. జైపూర్‌లో హార్స్ ట్రేడింగ్ జ‌రిగింద‌న‌డానికి త‌మ‌ద‌గ్గ‌ర కావాల్సిన‌న్ని ఆధారాలు ఉన్నాయ‌ని గెహ్లాట్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు బేర‌సారాలు జ‌రుగుతున్న విష‌యాన్ని తాము ముందుగానే ప‌సిగ‌ట్టామ‌ని, అందుకే త‌మ ఎమ్మెల్యేల‌ను 10 రోజుల‌పాటు హోట‌ల్‌లో ఉంచాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు.