YS Sharmila : ఏదో ఒక రోజు తెలంగాణకు సీఎం అవుతా..అప్పటివరకు మంచి నీళ్లు కూడా ముట్టను.. షర్మిల శపథం..

తెలంగాణ ప్రభుత్వంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. తన దీక్షను భగ్నం చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇంకోసారి తనపై చేయి పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆమె నినాదాలు చేశారు. తెలంగాణకు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని షర్మిల అన్నారు. బంగారు తెలంగాణ తనతో సాధ్యమని.. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ పాదయాత్ర చేస్తానని షర్మిల ప్రకటించారు.

YS Sharmila : ఏదో ఒక రోజు తెలంగాణకు సీఎం అవుతా..అప్పటివరకు మంచి నీళ్లు కూడా ముట్టను.. షర్మిల శపథం..

Ys Sharmila

YS Sharmila : తెలంగాణ ప్రభుత్వంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. తన దీక్షను భగ్నం చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇంకోసారి తనపై చేయి పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆమె నినాదాలు చేశారు. తెలంగాణకు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని షర్మిల అన్నారు. బంగారు తెలంగాణ తనతో సాధ్యమని.. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ పాదయాత్ర చేస్తానని షర్మిల ప్రకటించారు.

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు(ఏప్రిల్ 15,2021) ఉదయం ఇందిరాపార్కు దగ్గర ఆమె దీక్ష చేపట్టారు. 72గంటలు దీక్ష చేయాలని అనుకున్నారు. అయితే ఒక్కరోజుకే అనుమతి ఉందని.. దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినా షర్మిల దీక్ష కొనసాగించడంతో ఆమె దీక్షను భగ్నం చేశారు.

మళ్లీ పాదయాత్ర చేస్తా:
ఇందిరా పార్కు దగ్గర దీక్ష భగ్నం చేసిన అనంతరం అక్కడి నుంచి లోటస్‌పాండ్‌కు నడిచి వెళ్లేందుకు షర్మిల యత్నించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై పోలీసులు ఆమెను అడ్డుకుని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి షర్మిలను పోలీసు వాహనంలోనే లోటస్‌పాండ్‌కు తరలించారు. అక్కడ తన నివాసం ముందు ఏర్పాటు చేసిన వేదికపై షర్మిల దీక్ష కొనసాగిస్తున్నారు. తన కార్యకర్తలను వదిలిపెట్టే వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోనని చెప్పారు.

ఇందిరా పార్క్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వెంటనే పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు. అయినా ఆమె పాదయాత్ర కొనసాగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, షర్మిల అభిమానులకు మధ్య జరిగిన తోపులాటలో ఆమె కొద్దిసేపు స్పృహతప్పి పడిపోయారు. దీంతో పోలీసులు ఆమెను వాహనంలో లోటస్‌పాండ్‌కు తరలించారు. తోపులాటలో షర్మిల దుస్తులు చిరిగాయి. షర్మిల చేయికి బలమైన గాయమైంది.

దీంతో లోటస్‌పాండ్‌కు ప్రత్యేక వైద్య బృందం చేరుకుంది. షర్మిలకు పరీక్షలు చేసింది. డాక్టర్ ఆమె చేతికి కట్టుకట్టారు. మరోవైపు లోటస్‌పాండ్‌కు షర్మిల అభిమానులు భారీగా చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తనను గాయపరిచారని, మరోసారి చేయిపడితే ఊరుకోబోనని షర్మిల హెచ్చరించారు. అంతకుముందు షర్మిలను అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత షర్మిల లోటస్‌పాండ్‌లో దీక్ష కొనసాగిస్తున్నారు.