దిశా నిందితుల ఎన్ కౌంటర్ : అప్పటి వరకు మృతదేహాలు తీసుకోం

  • Published By: madhu ,Published On : December 13, 2019 / 12:37 PM IST
దిశా నిందితుల ఎన్ కౌంటర్ : అప్పటి వరకు మృతదేహాలు తీసుకోం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు, ఎన్‌హెచ్ఆర్సీలో విచారణ జరుగుతోంది. మరోవైపు… నిందితుల మృతదేహాల అప్పగింతపైనా హైకోర్టులో విచారణ జరుగుతోంది. నిందితుల ఎన్‌కౌంటర్‌ను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా నిందితుల కుటుంబీకులు పోలీసుల తీరుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.

తప్పు చేసినట్లు తేలితే… శిక్షించాల్సింది కానీ.. ఎందుకు ఎన్‍‌కౌంటర్ చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల్ని కావాలనే ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ పిల్లల మృతదేహాలను తీసుకునే ప్రసక్తే లేదని… ఊళ్లోకి తీసుకొచ్చినా… అసలు ముట్టుకోబోమంటున్నారు నిందితుల బంధువులు.

తమ పిల్లలను అన్యాయంగా.. పిట్టలను కాల్చేసినట్లు కాల్చేశారంటున్నారు నిందితులు కుటుంబీకులు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లైనా సరే మృతదేహాలను ముట్టుకునేదే లేదంటున్నారు. 

దిశ ఘటన జరిగిన మరుసటి రోజే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కోర్టునుంచి అనుమతి తీసుకుని నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించే క్రమంలో వెపన్స్ లాక్కుని పోలీసులపైనే దాడి చేశారు. దీంతో… పోలీసులు నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు.

అనంత‌రం వారి శ‌వాల‌ను గాంధీ ఆస్పత్రికి త‌ర‌లించారు. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోయినవారి మృతదేహాలను హైకోర్టు ఆదేశాల మేరకు అలాగే భద్రపర్చాలని, తాము తదుపరి ఆదేశాలిచ్చేవరకు హైకోర్టు ఆదేశాలే కొనసాగుతాయని సుప్రీకోర్టు స్పష్టంచేసింది. అయితే, గాంధీ మార్చురీలో నిందితుల మృత‌దేహాలు కుల్లిపోయి కంపుకొడుతున్నట్లు తెలుస్తోంది. 
Read More : పసుపు బోర్డు డౌటే : మాట మార్చిన నిజామాబాద్ ఎంపీ