ఆర్టీసీ సమ్మె @47వ రోజు : హైకోర్టులో విచారణ..ఉత్కంఠ

  • Published By: madhu ,Published On : November 20, 2019 / 12:16 AM IST
ఆర్టీసీ సమ్మె @47వ రోజు : హైకోర్టులో విచారణ..ఉత్కంఠ

ఆర్టీసీ కార్మికుల సమ్మె 47వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా.. అన్ని డిపోల దగ్గర కార్మికుల నిరసనలు కొనసాగనున్నాయి. ఇక రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రవాణా రంగంలో రూట్లను ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టం చెబుతుందో తెలపాలని పిటిషనర్‌ను కోరింది. నవంబర్ 20వ తేదీ బుధవారం విచారించనుంది ధర్మాసనం. అదే విధంగా.. కార్మికుల జీతాలు, ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. 

ఆర్టీసి రూట్లను ప్రైవేటీకరణ చేస్తూ తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమన్న పిటిషనర్ వాదనలు వినిపించారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం..రోడ్డు రవాణ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని.. ఆర్టీసీ, ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం సర్కార్‌కు ఉన్నప్పుడు.. కేబినెట్ నిర్ణయం ఎలా తప్పు అవుతుందో తెలపాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.

మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా..ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలన్నారు పిటిషనర్‌ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. నియమ నిబంధనలను పాటించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో చట్టప్రకారం ప్రతిపాదిక మార్పుల వివరాలను స్థానిక దినపత్రికల్లో ప్రచురించాలని.. అభ్యంతరాలు స్వీకరించేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది ధర్మాసనం.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయం చట్టబద్దమా..? చట్టవిరుద్ధమా..? అనేది న్యాయస్థానం ముందున్న అంశమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియ అనుసరిస్తుందా..? లేదా..? అని తెలియకుండానే.. చట్టవిరుద్ధమని ఎలా అంటామని పిటిషనర్‌ను ప్రశ్నించింది హైకోర్టు. మరి..విచారణలో హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో చూడాలి. 
Read More : కూలీలుగా మారిన ఆర్టీసీ కార్మికులు : స్టీరింగ్‌ పట్టాల్సిన చేతులు..గరిటె తిప్పుతున్నాయి