అంబటి రాంబాబుకి సొంత పార్టీలోనే సెగ.. కోడెలలానే మారిపోయారని మండిపడుతున్న కార్యకర్తలు

  • Published By: naveen ,Published On : September 1, 2020 / 11:54 AM IST
అంబటి రాంబాబుకి సొంత పార్టీలోనే సెగ.. కోడెలలానే మారిపోయారని మండిపడుతున్న కార్యకర్తలు

మాటల తూటాలతో ప్రతిపక్షాలను నిత్యం ఇరకాటంలో పెట్టే అధికార పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సొంత పార్టీలోనే సెగ మొదలైంది. తన నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది. రాష్ట్ర రాజకీయాలతోపాటు, వైసీపీలో పెద్ద సౌండ్‌తో మాట్లాడుతూ పాపులర్ నేతగా ముద్రపడ్డ అంబటి పరిస్థితి ప్రస్తుతం ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిమోత అన్నట్లుగా తయారైందంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు రాంబాబు. ఎన్నికలకు ముందే వైసీపీలోని ఓ వర్గం అంబటికి టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించింది.

తెలుగుదేశం నుంచి పార్టీలోకి వలస వచ్చిన వారికి అంబటి ప్రాధాన్యం:
ఎన్నికల్లో గెలిచిన అనంతరం అంబటి మాత్రం సొంత పార్టీ నేతలను పక్కనపెట్టి తెలుగుదేశం నుంచి పార్టీలోకి వలస వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంతైనా పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువ కదా. అంతే ఇది సొంతింట్లో ఉన్న వారికి కోపాన్ని కలిగిస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ వారంతా అంబటి వ్యవహారశైలిపై గత కొంతకాలంగా రగిలిపోతున్నారు.

గతంలో టీడీపీ నేత కోడెల శివప్రసాద్‌పై అంబటి ఏవైతే ఆరోపణలు చేశారో… అవే ఇప్పుడు అంబటిపై సొంత పార్టీ నుంచే రిపీట్‌ అవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఉండగా కోడెల వ్యవహారశైలి నచ్చక ఆ పార్టీకి చెందిన ఓ బ్యాచ్ తిరుగుబాటు చేసింది. ఆ రోజు కోడెలను వ్యతిరేకించిన టీడీపీ బ్యాచ్ ప్రస్తుతం అంబటి అక్రమ వ్యవహారాల్లో చక్రం తిప్పుతుండటాన్ని వైసీపీలో తొలి నుంచి ఉన్న నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే సోదరుడు, రూ.20కోట్ల పనులు అయినవారికి అప్పగింత:
సత్తెనపల్లి నియోజకవర్గానికి అధికారికంగా అంబటి రాంబాబు ఎమ్మెల్యే అయినా ఆయన సోదరుడు అంబటి మురళీయే వ్యవహారాలన్నీ నడిపిస్తూ అనధికారిక ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారని అంటున్నారు. స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలను దూరం పెట్టటంతోపాటు, నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కాంట్రాక్టులు సైతం సోదరుడు అంబటి మురళీనే బినామీ పేర్లతో చేయిస్తూ లబ్ధి పొందుతున్నారంటూ ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.

కొద్ది నెలల క్రితం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి సుమారు 20 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు. కానీ, నియోజకర్గంలోని పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన వారిని కాదని చిలకలూరిపేటకు చెందిన ఓ వ్యక్తికి అంబటి రాంబాబు కాంట్రాక్టు కట్టబెట్టటంపై నియోజకవర్గ వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారట.
https://10tv.in/is-cm-jagan-next-target-tdp-leader-devineni-uma/
సొంత పార్టీ కార్యకర్తలే అంబటిపై పిల్ వేశారు:
తాజాగా మైనింగ్ వ్యవహారంలో వైసీపీ కార్యకర్తలే అంబటి రాంబాబుపై న్యాయస్ధానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయటం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. రాజుపాలెం మండల పరిధిలోని కోటనెమలిపురి వద్ద సున్నపురాయి క్వారీలను అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. అంబటి సోదరుల కనుసన్నల్లో టీడీపీ బ్యాచ్ ఈ మైనింగ్ చేస్తుండడం వైసీపీలోని నేతలకు నచ్చడం లేదు. మైనింగ్ ద్వారా రోజుకు 10 లక్షల రూపాయలు వెనుకేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని వైసీపీ నేతలు ప్రశ్నించటంతోపాటు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. మైనింగ్ శాఖ అధికారులు ఆ ఫిర్యాదును లైట్‌గా తీసుకున్నారు.

ఫిర్యాదులు చేసినవారిపై తప్పుడు కేసులు:
అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఫిర్యాదులు చేసిన వారిని టార్గెట్ చేసి అక్రమ మద్యంతోపాటు, ఇతర తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారన్న ఆరోపణలను అంబటి ఎదుర్కొంటున్నారు. అంబటి చర్యలపై ఇప్పటికే స్ధానిక వైసీపీ నేతలు రహస్య భేటీ నిర్వహించటంతోపాటు, రెండు నెలల క్రితమే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. ఈ వ్యవహారంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని డెడ్ లైన్ విధించారు. కానీ, పార్టీ ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ఏకంగా న్యాయస్ధానంలో అంబటి అక్రమ మైనింగ్‌పై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

అక్రమ మైనింగ్‌పై నివేదిక సమర్పించాలని న్యాయస్ధానం ఆదేశాలు జారీ చేయటంతో సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైసీపీ నేతలు, కార్యకర్తల్లో అంబటిపై ఇది తమ తొలి విజయమంటూ సంబరపడిపోతున్నారట. మరి జగన్‌ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలంటున్నారు నియోజకవర్గ ప్రజలు.