pawan kalyan as AP CM : ఏపీ సీఎం గా పవన్ ని ప్రకటించటం వెనుక “కమలం కతలేంటి…”

pawan kalyan as AP CM : ఏపీ సీఎం గా పవన్ ని ప్రకటించటం వెనుక “కమలం కతలేంటి…”

Bjp Jamasena

pawan kalyan as AP CM , What is the strategy of BJP : ఏపీలో జనసేనానిని కమలం పార్టీ పువ్వులా చూసుకోవాలని అని ఎందుకు అనుకుంటోంది… అసలు బీజేపీ నేతల ఆంతర్యమేమిటీ… ఏపీకి పవన్‌ను సీఎం చేస్తామంటూ బీజేపీ నేతలు ప్రకటించడం వెనుక అసలు మతలబు ఏమిటీ… ఇదంతా కమలం పార్టీ నేతల పక్కా ప్లాన్‌ అంటూ విపక్షాల మాటలే నిజమా…

తిరుపతి ఉపఎన్నిక హీట్ పీక్ స్టేజ్ చేరింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎలాగైనా గెలువాలని బీజేపీ… జనసేనాని పవన్‌పై గంపెడాశలు పెట్టుకుంది. తిరుపతిలో ఓట్లు రాలాలంటే… పవన్‌ రావాల్సిన పరిస్థితిని బీజేపీ వ్యూహాత్మకంగా క్రియేట్‌ చేసింది. ప్రధానంగా కాపు ఓట్లపై దృష్టిపెట్టిన బీజేపీ… పవనే తమ సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించడం ద్వారా… ప్రచారానికి ఆయన రాక తప్పనిసరి పరిస్థితిని కల్పించింది.

బీజేపీ ప్రకటనతో.. పవన్‌ ఇష్యూనే ఇప్పుడు పొలిటికల్‌గా హాట్‌ టాపిక్‌ మారింది. బీజేపీ-జనసేన మధ్య గ్యాప్‌ వచ్చిందని సంబరపడ్డ టీడీపీ నేతలకు ఓ రకంగా ఈ పరిణామం షాకింగ్‌ లాంటిదే. అందుకే.. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై విమర్శల దాడి మొదలుపెట్టారు. కేవలం తిరుపతి ఉప ఎన్నిక కోసమే పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ నేతలు కాకా పడుతున్నారని టీడీపీ నేత జవహర్‌ విమర్శించారు. సోము వీర్రాజుకు పవన్‌ కల్యాణ్‌ అంత అప్తమిత్రుడు ఎలా అయ్యారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అటు వైసీపీ నేతలు కూడా పవన్‌ను సీఎం అంటూ ప్రకటించిన సోము వీర్రాజుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరి చెవులో పువ్వులు పెట్టేందుకు ఇలా ప్రకటిస్తున్నారంటూ ఇప్పటికే వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. బీజేపీ-జనసేన బలం ఏంటో అందరికీ తెలుసంటూ సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

అటు టీడీపీ.. ఇటు వైసీపీ.. విమర్శలు గుప్పిస్తుంటే… పవన్‌పై ఆసక్తికర కామెంట్లు చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు. ఆయన కాంగ్రెస్‌తో చేతులు కలపాలంటూ విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతలు ఎన్ని మాటలైనా చెబుతారంటూ ఎద్దేవా చేశారు.

ఎవరేమనుకున్నా బీజేపీ మాత్రం.. పక్కా ప్లాన్‌ను పట్టాలెక్కిస్తోంది. పవన్ ను సీఎం అభ్యర్థి అని ప్రకటించడం వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే లాభం తప్ప నష్టమేమీ లేదు. పైగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఓటు బ్యాంక్ ఏంటనే విషయంపై బీజేపీ స్పష్టమైన అంచనాకు వచ్చింది.

తమ ఓటు బ్యాంకుకు పవన్, జనసేన చరిష్మా కలిస్తే.. ఏపీలో బలమైన శక్తిగా ఎదుగొచ్చన్నది బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళిక. ఏపీలో కాపు సామాజిక వర్గం రాజకీయాల్లో బలమైన శక్తిగా ఉంది. పవన్ కల్యాణ్ సీఎం అవుతారనే ఉద్దేశంతో కాపు సామాజిక వర్గం ఓట్ల పోలరైజేషన్ జరిగే అవకాశం ఉంటుంది.

దానివల్ల వైసీపీ బలం తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తం మీద, పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో బలమైన శక్తిగా రూపొందాలనే వ్యూహాన్ని బీజేపీ రచించినట్లు కనిపిస్తోంది.