బీజేపీలో జనసేన విలీనం..? : పవన్ పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు

ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీకి ప్రశ్నలెన్నో.. పార్టీలోని వారే ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీని ఇంత మంది ఎందుకు వీడుతున్నారనేది ఓ ప్రశ్న.. పార్టీలో మిగిలే వారెందరనేది మరో

  • Edited By: veegamteam , January 31, 2020 / 02:16 PM IST
బీజేపీలో జనసేన విలీనం..? : పవన్ పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు

ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీకి ప్రశ్నలెన్నో.. పార్టీలోని వారే ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీని ఇంత మంది ఎందుకు వీడుతున్నారనేది ఓ ప్రశ్న.. పార్టీలో మిగిలే వారెందరనేది మరో

ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీకి ప్రశ్నలెన్నో.. పార్టీలోని వారే ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీని ఇంత మంది ఎందుకు వీడుతున్నారనేది ఓ ప్రశ్న.. పార్టీలో మిగిలే వారెందరనేది మరో ప్రశ్న. ఉన్న కొద్ది మందినైనా అధినేత కాపాడుకోగలడా అన్నదే అసలు ప్రశ్న. ఇన్ని ప్రశ్నల మధ్య పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందేమో అన్నది మరికొందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నల పరంపర మధ్య పార్టీ మరో పార్టీలో విలీనం అయిపోతుందేమో అన్నదే అనుమానంతో కూడిన బలమైన ప్రశ్న.

పవన్ ను ఒంటరి చేస్తున్న ముఖ్య నేతలు:
జనసేన పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. కారణాలేవైనా పార్టీ నిర్మాణానికి ఇవి స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నాయని అనుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్క నేతా జనసేన నుంచి బయటకు వెళ్లిపోవడం ప్రారంభమైంది. తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వరకూ ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆయన కూడా జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ అధినేత పవన్ కు ఓ లేఖ రాశారు. కాకపోతే ఇందుకు ఆయన చూపించిన కారణాలపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. ఇప్పటికే జనసేనకు తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి ఎన్నికైన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ కూడా పార్టీని వీడిపోవడంతో జనసేన పరిస్థితిపై పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. 

రాపాకపై చర్యలకు భయపడుతున్నారా?
ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు విషయంలో జనసేన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా, అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయనపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకొనేందుకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు రాపాకపై చర్యలు తీసుకుంటే అఫీషియల్‌గా పార్టీ తరఫున ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోతారని పార్టీ భావిస్తోందంట. ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసినా.. బహిష్కరించినా రాపాక పదవికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఎందుకంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్లిపోతే అది ఫిరాయింపు చట్టం కిందకు రాదంటున్నారు. అందుకే ఆయన విషయంలో ఆచితూచి అడుగు వేయాలని జనసేన భావిస్తోందని అంటున్నారు. 

రాపాక అంశాన్ని పెండింగ్‌లో పెట్టినట్టేనా?
గత రెండు నెలలుగా రాపాక వ్యవహార శైలి జనసేనకు తలనొప్పిగానే ఉంటోంది. పార్టీ అధినేత పవన్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఆయన వ్యవహారం ఉంటోంది. అయినా పార్టీ కేడర్‌ గానీ, నాయకులు గానీ, పార్టీ పరంగా గానీ ఇంత వరకూ ఒక్కసారి కూడా రాపాకకు వ్యతిరేకంగా మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పార్టీ క్రమశిక్షణ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మాత్రం పవన్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఆ తర్వాత ఆయన సినిమా షూటింగ్‌లో బిజీ అయిపోయారంట. అప్పటి నుంచి రాపాక విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ప్రస్తుతానికి రాపాక విషయాన్ని పక్కనపెట్టేసి, ఇతరత్రా అంశాలపై దృష్టి సారిస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సీబీఐ మాజీ జేడీ రాజీనామాకు అసలు కారణం అదేనా?
మరోపక్క, పార్టీ నుంచి ఒక్కో నేత బయటకు వెళ్లిపోతుండడంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లక్ష్మీనారాయణకు ఎక్కువ ఓట్లే వచ్చాయి. పవన్‌తో పాటు ఆయనపైన ఉన్న అభిమానంతోనే ఓట్లు భారీ సంఖ్యలో రాబట్టుకోగలిగారు. ఎన్నికల తర్వాత కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. కొంత కాలం తర్వాత మళ్లీ చురుకుగా పాల్గొంటూ రావడంతో అంతా సద్దుమణిగిందని అనుకున్నారు. అయితే, ఇప్పుడు సడన్‌గా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో కేడర్‌ అంతా షాక్‌కు గురైందంటున్నారు. కాకపోతే ఆయన చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవనే వాదన వినిపిస్తోంది. పవన్‌ సినిమాల్లో నటించడం వల్ల పార్టీకి గానీ, ఏపీ జనాలకు గానీ వచ్చే నష్టమేమీ లేదనేది కొందరి అభిప్రాయంగా ఉంది.

బీజేపీలో జనసేన విలీనం..?:
పవన్‌ కల్యాణ్‌ కూడా తనకు సినిమాల ద్వారానే ఆదాయం వస్తుంది కాబట్టి… నటిస్తున్నానని చెబుతున్నారు. తనకు ఇతరత్రా వ్యాపారాలేవీ లేవని, పార్టీ నిర్వహణకు సినిమాల ద్వారా వచ్చే ఆదాయం అవసరమని భావించినందునే నటిస్తున్నానని అంటున్నారు. మరోపక్క, నాదెండ్ల మనోహర్‌ మాత్రమే పవన్‌తో ఎక్కువగా కనిపిస్తున్నారు. మిగిలిన నాయకులు ఎవరూ ఎక్కడా అంతగా కనిపించడం లేదని, మనోహర్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇతర నాయకులు అసంతృప్తి చెందుతున్నారని, ఆ కారణంగానే బయటకు వెళ్లిపోతున్నారనే టాక్‌ పార్టీలో వినిపిస్తోంది. మొత్తం మీద ఒక్కొక్క నాయకుడు బయటకు వెళ్లిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీతో కలిసి ముందుకు సాగాలనుకుంటున్న జనసేన పార్టీ.. కొంత కాలానికి ఆ పార్టీలో విలీనం అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని జనాలు అనుకుంటున్నారు.