సుగాలి ప్రీతికి.. న్యాయం జరగకపోతే కర్నూలులో న్యాయ రాజధాని ఎందుకు?

ఏపీలో సంచలనం రేపుతున్న సుగాలి ప్రీతి కేసులో జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ కు ప్రశ్నలు సంధించారు. దిశ

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 11:45 AM IST
సుగాలి ప్రీతికి.. న్యాయం జరగకపోతే కర్నూలులో న్యాయ రాజధాని ఎందుకు?

ఏపీలో సంచలనం రేపుతున్న సుగాలి ప్రీతి కేసులో జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ కు ప్రశ్నలు సంధించారు. దిశ

ఏపీలో సంచలనం రేపుతున్న సుగాలి ప్రీతి కేసులో జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ కు ప్రశ్నలు సంధించారు. దిశ కేసు తరహాలోనే కర్నూలు అమ్మాయి సుగాలి ప్రీతిని హత్యాచారం చేసిన నిందితులకు శిక్ష పడాలని పవన్ డిమాండ్ చేశారు. అలాగని నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని చెప్పడం లేదన్నారు. ప్రీతి హత్య కేసుని సీబీఐతో విచారణ జరిపించాలని పవన్ డిమాండ్ చేశారు. మాట పూర్వకంగా కాకుండా రాతపూర్వక హామీ ఇవ్వాలన్నారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించకుంటే.. మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని పవన్ హెచ్చరించారు. ఈ కేసుకి సంబంధించి జగన్ ప్రభుత్వానికి చాలాసార్లు విజ్ఞప్తి చేశామని పవన్ తెలిపారు. న్యాయం చేస్తామని చెప్పిన జగన్.. ఇప్పటివరకు చేయలేదన్నారు.

న్యాయం జరక్కపోతే.. న్యాయ రాజధాని ఎందుకు?
దిశ అత్యాచారం, హత్య కేసు గురించి అసెంబ్లీలో ప్రసంగాలు చేసిన సీఎం జగన్.. కర్నూలులో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించరని పవన్ ప్రశ్నించారు. విద్యార్థినికి న్యాయం జరగకపోతే.. కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్ పెట్టి ఏం లాభం? అని జగన్ ప్రభుత్వాన్ని అడిగారు. రాయలసీమలో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే జగన్ ఎందుకు మాట్లాడరని నిలదీశారు. చంద్రబాబు పాలనలో ఈ సంఘటన జరిగితే మీరు ఏం చేశారు అని పవన్ అడిగారు. విద్యార్థిని హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పవన్ డిమాండ్ చేశారు. స్కూల్ కి వెళ్లి ఇంటికి రావాల్సిన బిడ్డను అత్యాచారం చేసి చంపేశారని పవన్ వాపోయారు. విద్యా సంస్థల్లో విద్యార్థులకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.

న్యాయం కోసం పవన్ పోరాటం:
సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బుధవారం(ఫిబ్రవరి 12,2020) కర్నూలు నగరంలో జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకు పవన్ ర్యాలీ చేపట్టారు. జనసేన నేతలు, ప్రజ సంఘాలు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుగాలి ప్రీతి తల్లిదండ్రులను పవన్ పరామర్శించారు.