జేసీ మళ్లీ అరెస్ట్! బైటకొచ్చిన 24గంటల్లోనే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూడు కేసులు

  • Published By: naveen ,Published On : August 7, 2020 / 02:52 PM IST
జేసీ మళ్లీ అరెస్ట్! బైటకొచ్చిన 24గంటల్లోనే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూడు కేసులు

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్. జైలు నుంచి బయటకు వచ్చిన 24గంటల్లోనే ప్రభాకర్ రెడ్డిపై మళ్లీ కేసులు నమోదయ్యాయి. అనంత‌పురం పోలీసులు జేసీపై మూడు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. ఐపీసీ 353తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసులు ఫైల్ చేశారు. కడప జైలు నుంచి విడుద‌లైన తర్వాత ప్రభాకర్ రెడ్డి ర్యాలీగా తాడిపత్రి వచ్చారు. ఆ సమయంలో ట్రాఫిక్ సీఐ పట్ల జేసీ దురుసుగా ప్రవర్తించారని ఈ కేసులు నమోదు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చి 24 గంట‌లు తిర‌గ‌క ముందే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మ‌రో మూడు కేసులు నమోదు కావడం గమనార్హం.



జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలు కడప జైలు నుంచి గురువారం(ఆగస్టు 6,2020) విడుదలయ్యారు. జైలు నుంచి భారీ కారు ర్యాలీతో తాడిపత్రి వెళ్లారు. ఈ ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని విధుల్లో ఉన్న తాడిపత్రి సీఐ దేవేంద‌ర్ చెప్పారు. దీంతో సీఐ పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా వ్యవహరించారు. అదే టైమ్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు సైతం కొద్దిసేపు హంగామా సృష్టించారు. ఈ సంఘ‌ట‌న‌పై విచార‌ణ చేసిన తర్వాత పోలీసులు కేసులు నమోదు చేశారు.

బెయిల్‌పై కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ప్రభాకర్ రెడ్డి కనీసం ఇంటికి కూడా చేరకముందే వివాదాలను కొని తెచ్చుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై విరుచుకుపడ్డారు. వారిపై దూసుకెళ్లారు. ఘాటు పదాలతో దౌర్జన్యానికి దిగారు. తనకు కేసులు కొత్త కాదని, ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని రెచ్చిపోయారు.



వాహనాల ట్యాంపరింగ్, అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే బెయిల్‌పై కడప సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా జైలు దగ్గరికి పెద్ద సంఖ్యలో చేరుకున్న తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి 20కి పైగా వాహనాలతో ర్యాలీగా వారిద్దరూ కడప నుంచి అనంతపురానికి చేరారు. అనంతపురం శివార్లకు చేరాక మరికొందరు అభిమానులు బైక్‌లతో ర్యాలీలో కలిశారు.

కాగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ర్యాలీగా వెళ్లకూడదని చెప్పారు. రాత్రివేళ లాక్‌డౌన్ నిబంధనలను పాటించాల్సిందే అని సూచించారు. దీంతో కారు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారితో వాగ్వాదం పెట్టుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారంటూ నిలదీశారు. పోలీసులు చెప్పే విషయాన్ని వినిపించుకోలేదు. పైగా, మళ్లీ అరెస్టు చేస్తావా? ఏం పీకుతావ్? పక్కకు పో అంటూ దురుసుగా మాట్లాడారు. ఈ ఘటనతో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదమైంది. జైలు నుంచి విడుదలైన కొన్ని గంటల్లోనే ఏకంగా డ్యూటీలో ఉన్న పోలీసులపై ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.



జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ గూండాలా ప్రవర్తించారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులంటే జేసీ బ్రదర్స్‌కు ఎందుకంత చులకన.. ఒక ప్రజాపతినిధిగా పనిచేసిన వ్యక్తి పోలీసులతో ఇలా ప్రవర్తించడం దారుణం అన్నారు. బహింరంగంగానే పోలీసులకు వార్నింగ్ లు ఇవ్వడం, దౌర్జన్యానికి దిగడం టూ మచ్ అన్నారు. జేసీ బ్రదర్స్ ఆగడాలపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.