కాయ్ రాజా కాయ్ : ఏపీలో బెట్టింగ్ ల జోరు

  • Published By: chvmurthy ,Published On : March 6, 2019 / 11:22 AM IST
కాయ్ రాజా కాయ్ : ఏపీలో బెట్టింగ్ ల జోరు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్స్‌ జోరందుకున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని ఏ పార్టీ చేజిక్కించుకుంటుందన్న దానిపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. బెట్టింగ్‌ కాసేవారికి బెట్టింగ్‌ రాయుళ్లు ఆఫర్స్‌ కూడా ఇస్తున్నారు. మరోపక్క ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ కోసం విద్యార్థులే టార్గెట్‌గా బెట్టింగ్‌ రాయుళ్లు సన్నాహాలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికారం చేజిక్కించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. రాజకీయ పార్టీలు అధికారం కోసం వ్యూహాల్లో మునిగిపోగా… మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు జోరు పెంచారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ బెట్టింగ్‌ కాస్తున్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కోట్ల రూపాయలు బెట్టింగ్‌ వేస్తున్నారు. 

వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటూ అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఒకటికి రెండు రెట్లు ఇస్తామంటూ భారీగా ఆఫర్స్‌ ఇస్తున్నట్టు తెలుస్తోంది. తామేమీ తక్కువకామంటూ… ప్రతిపక్ష వైసీపీతోపాటు జనసేన, బీజేపీ నాయకులూ పందేలు కాస్తున్నారు. రాయలసీమకు చెందిన వైసీపీ నేతలు తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటూ పందేలకు తెరలేపినట్టు తెలుస్తోంది.  తామేమి తక్కువకాబోమంటూ జనసేన నాయకులూ పందేలకు రెడీ అయిపోతున్నట్టు సమాచారం. జనసేన, సీపీఎం, సీపీఐతో కలిసి పోటీ చేస్తున్నందున మినిమం సీట్లు వస్తాయని రాష్ట్రంలో రింగ్‌ తిప్పేది తామేనంటూ ఉత్తరాంధ్రలో బెట్టింగ్స్‌ జోరుగా సాగుతున్నాయి.  అంతేకాదు… ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా… అది జనసేన మద్దతుతోనేనంటూ ఉభయగోదావరి జిల్లాలతోపాటు.. గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు బెట్టింగ్స్‌ వేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలూ బెట్టింగ్స్‌ వేస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో మోడీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి గతంకంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ పందేలకు రెడీ అయ్యారు.

ఇదిలా ఉంటే మరో పక్క ఐపీఎల్‌ కూడా వచ్చేస్తోంది. ఈనెల 23 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఫస్ట్‌ షెడ్యూల్‌ కూడా విడుదలైంది.  దీంతో బెట్టింగ్‌రాయుళ్లు అప్పుడే బెట్టింగ్స్‌కు రెడీ అయిపోతున్నారు. పాత పరిచయాలను క్యాష్‌ చేసుకునేందుకు వాట్సాప్‌తోపాటు ఫేస్‌బుక్‌లను ఉపయోగించుకుంటున్నారు. అంతేకాదు… విద్యార్థులకు గాలెం వేసేందుకు బెట్టింగ్ రాయుళ్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

క్రికెట్‌ బెట్టింగ్స్‌ అయినా… అవి పొలిటికల్‌ బెట్టింగ్స్‌ అయినా అరికట్టాల్సింది పోలీసులే. కానీ ఏపీ పోలీసులు మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.  దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాపకింద నీరులా కొనసాగుతున్న బెట్టింగ్స్‌ను పోలీస్‌, నిఘా వ్యవస్థ అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.