ఖమ్మంలో పొలిటికల్ హీట్ : పార్లమెంట్ ఎన్నికలపై పార్టీల దృష్టి

ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : March 14, 2019 / 04:20 PM IST
ఖమ్మంలో పొలిటికల్ హీట్ : పార్లమెంట్ ఎన్నికలపై పార్టీల దృష్టి

ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి.

ఖమ్మం : ఎన్నికల నగారా మోగడం ఆలస్యం… అన్ని పార్టీలూ వ్యూహ రచనలో మునిగిపోయాయి. అభ్యర్థుల వేట మొదలు పెట్టాయి. జిల్లాల వారీగా.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బలబలాలను బేరీజు వేసుకుంటున్నాయి. ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. ఓవైపు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తూనే.. ప్రచార వ్యూహాలు రచిస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ కూడా దూకుడు పెంచింది. అటు కాంగ్రెస్, టీడీపీలు ఇంకా డైలమాలోనే ఉన్నాయి. ఐక్యతా రాగం వినిపిస్తున్నా.. ఎవరిని దింపాలనే విషంపై వామపక్షాల్లో క్లారిటీ కొరవడంది.
 
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు ఉన్నాయి. వీటిలో టీఆర్‌ఎస్ అత్యంత బలమైన పార్టీగా ఎదిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్లు వచ్చినా… ఆ తర్వాత మారిన పరిస్థితులతో… బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. 2014 ఖమ్మం పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో… వైసీపీ నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్‌‍రెడ్డికి 4లక్షల 21వేల 957 ఓట్లు.. టీడీపీ నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావుకు 4లక్షల 9వేల 983 ఓట్లు వచ్చాయి. సీపీఎం సపోర్ట్‌తో పోటీ చేసిన సీపీఐకి లక్షా 87వేల 653 ఓట్లు వచ్చాయి. అయితే.. టీఆర్ఎస్‌ నుంచి పోటీ చేసిన బుడాన్‌బేగ్‌కు  89వేల 63 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత వైసీపీ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిపోయారు.

2014 ఎన్నికలకు.. 2018 ఎన్నికలకు ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులు మొత్తం మారిపోయాయి. వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. టీడీపీ నుంచి కీలక నేతలు కారెక్కేసారు. వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలోనే ప్రస్తుతం టీడీపీలో నేతలున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరాక.. వలసలు జోరుగా కొనసాగాయి. అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నేతలు కూడా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. జిల్లా నుంచి ఇప్పుడు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలుండగా.. సండ్ర వెంకటవీరయ్య త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికే రేగా కాంతారావు, హరిప్రియా నాయక్ టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీటిబాటలోనే మరో ఇద్దరు కూడా కారెక్కుతారని ప్రచారం ఉంది. అటు కేడర్‌ కూడా తమ నేతల బాటలోనే నడిచారు. దీంతో.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కకావికలమైంది. 

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ ప్రజలు గులాబీ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ కట్టబెట్టారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఖమ్మం ఎమ్మెల్సీగా బాలసాని లక్ష్మీనారాయణను గెలిపించారు. అటు మొన్న జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెల్చిన రాములు నాయక్‌ కూడా టీఆర్ఎస్‌లో చేరడంతో… ఆ పార్టీ లోక్‌సభ సమరానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. మొత్తంగా చూస్తే ఖమ్మం జిల్లాలో ఎండ వేడి లాగే… పొలిటికల్ హీట్ బీభత్సంగా పెరుగుతోంది.