ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ..లాభమా ? నష్టమా ? 

  • Published By: madhu ,Published On : November 23, 2019 / 12:28 AM IST
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ..లాభమా ? నష్టమా ? 

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అంటే ఏంటి? దీని వల్ల ప్రయాణికులకు లాభమా? నష్టమా? ఆర్టీసీ కార్మికులకు లబ్ధి చేకూరుతుందా? నష్టం జరుగుతుందా? అనే దానిపై ఎన్నో సందేహాలున్నాయి. వీటన్నింటిని డీకోడ్ చేస్తే.. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో 10 వేల 200 రూట్లు ఉన్నాయి. అందులో కొన్ని లాభాలు వచ్చే రూట్లు.. మరికొన్ని నష్టాలు వచ్చే రూట్లు ఉన్నాయి. మొత్తం రూట్లలో 50 శాతం.. అంటే 5 వేల 100 రూట్లను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన 50 శాతంలో 30 శాతం రూట్లలో ఆర్టీసీ కార్పొరేషన్ బస్సులు నడుస్తాయి. మరో 20 శాతం ఆర్టీసీ కార్పొరేషన్ కింద అద్దె బస్సులు నడుపుతారు.

రూట్లను ప్రైవేటీకరించడం అంటే.. ప్రభుత్వం ఎంపిక చేసిన మార్గాల్లో ప్రైవేట్ ఆపరేటర్లు తమ బస్సులను నడుపుతారు. ఆ బస్సుల్లో డ్రైవర్, కండక్టర్ కూడా ప్రైవేట్ వాళ్లే ఉంటారు. తమ బస్సులు నడుపుకునేందుకు పర్మిట్ ఇచ్చినందుకు.. ఏడాదికి కొంత మొత్తం ఆర్టీసీ కార్పొరేషన్‌కు చెల్లిస్తారు. ప్రైవేట్ ఆపరేటర్లు నడిపే బస్సుల్లోనూ.. ప్రభుత్వమే టికెట్ ధరలను నియంత్రిస్తుంది. సర్కార్ చెప్పినదాని కంటే ఎక్కువ ధరలు వసూలు చేయడానికి వీలుండదు. ప్రభుత్వం జారీ చేసే అన్ని రకాల సబ్సిడీ పాస్‌లు కూడా ప్రైవేట్ రూట్లలో చెల్లుబాటు అవుతాయని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. లాభాలు, నష్టాలు వచ్చే అన్ని మార్గాల్లోనూ ప్రైవేట్ ఆపరేటర్లు బస్సులు నడుపుతారని కూడా ఆయన చెప్పారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన రూట్ల ప్రైవేటీకరణ వల్ల ప్రయాణికులకు ఎలాంటి లాభం జరుగుతుందనేది పరిశీలిస్తే.. వారికి కొత్త బస్సులు, అందులో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అయితే, టికెట్ రేట్ల విషయంలోనే కొంత అనుమానం తలెత్తుతోంది. బస్సు చార్జీల నియంత్రణకు ఓ రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పారు. డీజిల్ రేట్లకు అనుగుణంగా.. ఎప్పటికప్పుడు చార్జీలు సవరించే అధికారం ఆ కమిటీకి ఉంటుందన్నారు. అందువల్ల.. ప్రభుత్వంతో పనిలేకుండా ఎప్పటికప్పుడు టికెట్ రేట్ల ధరల సవరణ జరుగుతూ ఉంటుంది.

కార్మికుల విషయానికొస్తే.. సుమారు 50 వేల మంది ఉన్నారు. వారంతా.. సమ్మెకు ముందు 10 వేల రూట్లలో బస్సులు నడిపారు. ఇప్పుడు వీటిలో 50 శాతం ప్రైవేటీకరిస్తే.. సగం మంది ఉద్యోగుల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. వారిని ఏం చేస్తారు? ఎలా వినియోగించుకుంటారని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే.. అధికారవర్గాల సమాచారం ప్రకారం కార్మికుల విషయంలో అనుసరించాల్సిన విధానాలపై.. ఓ కమిటీ వేస్తారని చెబుతున్నారు. అది.. రూట్ల ప్రైవేటీకరణ, కార్పొరేషన్ ఆస్తులు, కార్మికుల భవిష్యత్తుతో పాటు అంశాలన్నింటిని పూర్తిగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. దానిని బట్టి.. కార్మికుల భవితవ్యంపై.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.
Read More : ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్