Prof. Haragopal : ప్రజల మౌలిక సమస్యలను తీర్చలేనప్పుడే ఉద్యమాలు పుట్టుకొస్తాయి

ప్రజల మౌలిక సమస్యలను తీర్చలేనప్పుడే ఉద్యమాలు పుట్టుకొస్తాయని పౌరహక్కుల నేత, ప్రోఫెసర్ హరగోపాల్ అన్నారు.

Prof. Haragopal : ప్రజల మౌలిక సమస్యలను తీర్చలేనప్పుడే ఉద్యమాలు పుట్టుకొస్తాయి

Prof Haragopal Comments On Naxal Movement

Prof.Haragopal comments on Naxal Movement : ప్రజల మౌలిక సమస్యలను తీర్చలేనప్పుడే ఉద్యమాలు పుట్టుకొస్తాయని పౌరహక్కుల నేత, ప్రోఫెసర్ హరగోపాల్ అన్నారు. ఇటీవల చత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్, 23 మంది జవాన్లు మరణించిన అంశంపై ఈరోజు 10 టీవీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… రాజ్యము 60,70 శాతం పన్నుల రూపంలో వసూలు చేసి వాటిని విద్య, ఉద్యోగం, వైద్యం, సంక్షేమం కోసం ఖర్చు పెట్టినప్పుడు ప్రజా ఉద్యమాలు తలెత్తవని ఆయన సూచించారు.

ఉద్యమాలు అనేవి సమాజంలో వచ్చిన అసంతృప్తిని భిన్నరూపాల్లో వ్యక్తీకరించేవే అని హర గోపాల్ చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో 1967-71  సంవత్సరాల మధ్య విభిన్న అంశాలతో పలు ఉద్యమాలు మొదలయ్యాయని ప్రొఫసర్ హర గోపాల్ చెప్పారు.

ప్రజల అసంతృప్తుల్లోంచి వచ్చినవే నక్సల్బరీ, తెలంగాణ ఉద్యమాలని ఆయన వివరించారు. అప్పుడు  ప్రారంభమైన అనేక ఉద్యమాలకు పరిష్కారాలు కనుగొన్నప్పటికీ   నక్సల్బరీ  ఉద్యమం మాత్రం పలు రాష్ట్రాల్లో  విస్తరిస్తూనే ఉందని చెప్పారు.

వాస్తవానికి 1967, 68 లో కేవలం భారత దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు ….అలజడులు చెలరేగాయని ఫ్రాన్స్, అమెరికా, చైనా అన్ని దేశాల్లోనూ  ఉద్యమాలు పుట్టుకొచ్చాయని అది మన భారత దేశంలోనూ ఉందని ఆయన చెప్పారు.

గడిచిన 50 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎంత అణిచి వేయాలని చూసినా నక్సల్బరీ ఉద్యమం కొనసాగుతూనే ఉందని అయన అన్నారు. నక్సలైట్ ఉద్యమం సామాజిక, ఆర్ధిక ఉద్యమమా, శాంతిభద్రతల సమస్యా అనే అంశాన్ని పాలక వర్గాలు  తేల్చుకోలేక పోయాయని ఆయన అన్నారు.

నక్సలైట్ ఉద్యమంపై అధ్యయనానికి గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు పలువురు   మేధావులతో చర్చించి రూపోందించిన  నివేదికలను ఇంతవరకు బయట పెట్టలేదని ఆయన తెలిపారు.  రాను రాను ప్రభుత్వాలు దీన్ని శాంతి భద్రతల సమస్యగానే పరిగణించారని ఆయన అన్నారు.

పీవీనరసింహారావు, మన్మోహన్ సింగ్ లు ప్రధాన మంత్రులుగా పనిచేసే సమయానికి దేశం సంక్షేమ రాజ్య వ్యవస్ధ నుంచి పెట్టుబడిదారి ఆర్ధిక వ్యవస్ధలోకి మారిపోయిందని ఆయన అన్నారు. రాజ్య స్వభావంమారిపోయిందని అన్నారు.

ప్రజలకున్న మౌలిక సమస్యలను తీర్చలేనప్పుడు ఉద్యమాలు ఏదో ఒకరూపంలో పుట్టుకొస్తాయని….. ప్రజా ఉద్యమం వెనుక ఉన్నసామాజిక ఆర్ధిక సమస్యలను వాటి మూలాలను విస్మరిచటం వల్లే ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయని ఆయన తెలిపారు.

దేశాన్ని కార్పోరేటీకరించటం వల్లే ఉద్యమాలు మొదలవుతున్నాయని… ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక పంధాని ఒకసారి పునఃస్సమీక్షించుకోవాలని అవసరం ఉందని హరగోపాల్ సూచించారు