రేపటి నుంచి బియ్యం, ఎల్లుండి నుంచి నగదు పంపిణీ

  • Published By: Mahesh ,Published On : April 30, 2020 / 02:06 PM IST
రేపటి నుంచి బియ్యం, ఎల్లుండి నుంచి నగదు పంపిణీ

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌  వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.  మార్చినెలలో ఇచ్చినట్లు గానే … ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాలకు  మే1 వ తేదీ నుంచి ఉచిత బియ్యంను రాష్ట్రంలోని అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. 

క్రితం నెలలో ఇచ్చినట్లే తిరిగి ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున  బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ రూరల్, మెదక్ జిల్లాల్లో ప్రతి కార్డుదారుడికి కిలో కందిపప్పును కూడా ఉచితంగా అధికారులు పంపిణీ చేయనున్నారు. అదే విధంగా రూ.1500 ధన సహయాన్ని మే 2వ తేదీ నుంచి పౌరసరఫరాల శాఖ లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. 

లబ్దిదారులు సామాజిక దూరాన్ని పాటిస్తూ టోకెన్‌లో ఇచ్చిన నిర్దేశిత సమయంలోనే రేషన్‌ తీసుకోవాలని అధికారులు  సూచించారు. ప్రతి రేషన్‌ దుకాణం దగ్గర సబ్బు, శానిటైజర్‌, నీళ్లు వంటి సదుపాయాలు అందుబాటులో  ఉంచుకోవాలన్నారు.  ప్రతి ఒక్కరికీ రేషన్‌ ఇచ్చే వరకు రేషన్‌ షాపులు తెరిచే ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 87.55 లక్షల మంది ఆహార భద్రత కార్డులు ఉన్న వారికి  మేలు జరగనుంది.