గెలిచే అవకాశం లేకున్నా టికెట్ ఇచ్చారు, చంద్రబాబు కుట్రలకు రామయ్య బలైపోయాడా?

ఏదైనా కష్టమొస్తే.. రాముడికి చెప్పుకుంటాం.. కానీ రాముడి వల్లే కష్టమొస్తే.. సరిగ్గా ఇలాగే ఉంది వర్ల రామయ్య పరిస్థితి. అడిగినప్పుడు వరమీయకుండా.. అవసరం లేని

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 12:38 PM IST
గెలిచే అవకాశం లేకున్నా టికెట్ ఇచ్చారు, చంద్రబాబు కుట్రలకు రామయ్య బలైపోయాడా?

ఏదైనా కష్టమొస్తే.. రాముడికి చెప్పుకుంటాం.. కానీ రాముడి వల్లే కష్టమొస్తే.. సరిగ్గా ఇలాగే ఉంది వర్ల రామయ్య పరిస్థితి. అడిగినప్పుడు వరమీయకుండా.. అవసరం లేని

ఏదైనా కష్టమొస్తే.. రాముడికి చెప్పుకుంటాం.. కానీ రాముడి వల్లే కష్టమొస్తే.. సరిగ్గా ఇలాగే ఉంది వర్ల రామయ్య పరిస్థితి. అడిగినప్పుడు వరమీయకుండా.. అవసరం లేని సమయంలో కరుణ చూపించారు. అసలు దేవుడు లాంటి పార్టీ అధినేత అంతరంగం ఏంటో తెలియదు. కానీ, భక్తుడిని కరుణించలేదనే అపవాదు తనపై ఉండకూడదని ఈ రకమైన వరం వర్లకు ఇచ్చినట్టుంది.

బాబు కుట్రలకు రామయ్య బలైపోతున్నారంటున్న వైసీపీ:
రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకోడానికి అవసరమైన 41 మంది ఎమ్మెల్యేలు లేరు. అయినా టీడీపీ అధినేతల చంద్రబాబునాయుడు చాణక్యం ప్రదర్శించారు. గెలిచే అవకాశం లేకున్నా రాజ్యసభకు టీడీపీ తరఫున వర్ల రామయ్యను రంగంలోకి దించింతది. ఇప్పుడు పార్టీలోనే కాదు రాష్ట్రంలోనే చర్చనీయాంశం అయ్యింది. చంద్రబాబు కుట్రలకు దళితుడైన రామయ్య బలైపోతున్నారంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు మొదలుపెట్టేశారు. వైసీపీ నేతల విమర్శలకు వర్గ కూడా కౌంటర్లు వేశారు. రాష్ట్రంలో రామయ్య ఒక్కడే దళితుడు కాడనే విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకోవాలని, తనపై జాలి చూపిస్తున్న వాళ్లంతా జగన్ దగ్గరికెళ్లి, నాలుగు సీట్లలో ఒక్కటైనా దళితులకివ్వాలని డిమాండ్ చేయాలని మంట పుట్టించారు. 

గెలిచే అవకాశం లేకుండానే ఎందుకు పోటీ చేయిస్తున్నారు?
నిజానికి తెలుగుదేశం పార్టీలో వర్గ రామయ్యకు చాలా సార్లు అన్యాయం జరిగిందనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు కూడా గెలిచే అవకాశం లేకపోయినా రాజ్యసభ సీటు ఇవ్వడం దేనికి సంకేతమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో ఒక్క సీటులోనైనా గెలిచేందుకు అసెంబ్లీలో సరిపడా సంఖ్యాబలం టీడీపీకి లేదు. అయినా పోటీకి నిర్ణయించుకోవడం వెనుక బాబు వ్యూహం ఉందంటున్నారు. ఈ ఎంపికపై ప్రజల్లో చర్చ జరగాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. నిజానికి నాలుగు సీట్లలో ఒకటి రెడ్డి వర్గానికి, రెండు బీసీలకు కేటాయించగా, నాలుగవది మాత్రం ముకేశ్‌ అంబానీ కోరిక మేరకు పరిమల్‌ నత్వానీకీ ఆ సీటు ఇచ్చేసింది వైసీపీ. ఇక్కడ నుంచి నలుగురే గెలిచే అవకాశాలున్నాయి. అయినా ఐదో అభ్యర్థిగా వర్లను దింపడంతో ఇప్పుడు పోటీ అనివార్యమైందంటున్నారు. 

పోటీ లేకుండా వైసీపీకి సీట్లు ఇవ్వడం ఇష్టం లేకనే రంగంలోకి వర్లను దించారా?
గతంలో వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్‌గా వ్యవహరించారు. వైసీపీ ఆగడాలను తెలియజేసేందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించారు చంద్రబాబు. సంఖ్యాపరంగా చూసుకుంటే ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు సీట్లు వైసీపీ గెలుచుకోవడం ఖాయం. ఆ పార్టీ తరఫున రాజ్యసభ ఎన్నికల బరిలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఉంటారని వైసీపీ ప్రకటించింది. ఈ నలుగురు రాజ్యసభకు ఎన్నిక కావడం దాదాపుగా లాంఛనమే. కాకపోతే పోటీ లేకుండా నాలుగు స్థానాలను వైసీపీకి అప్పగించడం ఇష్టం లేని చంద్రబాబు వర్లను రంగంలోకి దించారంటున్నారు. 

దళిత వర్గానికి ప్రాధాన్యం ఇచ్చానని చెప్పుకోవడమే చంద్రబాబు ఉద్దేశం:
వర్లకు సీటు ఇవ్వడం ద్వారా తాను దళిత వర్గానికి తాను ప్రాధాన్యం ఇచ్చానని బాబు చెప్పుకోవడానికి వీలవుతుంది. ఈసారి గానీ, గతంలో కానీ.. దళితులకు రాజ్యసభ కేటాయించ లేదు వైసీపీ. అలాగే తన వైపు నుంచి తప్పు లేదని చాటుకుంటూ తాను దళితుల కోసం సీటు కేటాయించానని చెప్పుకొనేందుకు చంద్రబాబుకి వీలవుతుంది. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు రాజ్యసభ సీటు ఇచ్చారంటున్నారు. వర్లకు కూడా ఏదీ కలసి రావడం లేదంట. తొలుత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ కారణంగా ఎమ్మెల్సీ అవకాశాన్ని కోల్పోయారు. ఆ తర్వాత 2018లో రాజ్యసభ కోసం గట్టి ప్రయత్నాలే చేశారు వర్ల. చివరి నిమిషం వరకూ ఆయనకే ఇస్తారని అందరూ భావించారు. కానీ, చంద్రబాబు వేరే నిర్ణయం తీసుకోవడంతో వర్ల కొంతవరకూ నిరుత్సాహపడ్డారు. పార్టీకి విధేయుడిగా ఉండడంతో పాటు అధికార పక్షంపై విరుచుకుపడడంలో ఆయనకు ఆయనే సాటి అంటారు. 

ఇప్పుడు వర్లకు సీటిచ్చి చంద్రబాబు మమ అనిపించారా?
తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వర్లకు అవకాశం కల్పించే వీలున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు గెలిచే అవకాశం లేనప్పుడు మాత్రం సీటిచ్చి, మమ అనిపించారంటున్నారు. ఆరేళ్లలో మూడుసార్లు టీడీపీ నాయకుల్ని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు తన కోటరీలోని ముఖ్యులు, సొంత సామాజికవర్గం వారికి ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు ఎదురయ్యాయి. 2018లో టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సీఎం రమేశ్‌కు రెండోసారి ఇచ్చారు. మరో సీటును వర్ల రామయ్యకు ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌కు ఇచ్చారు. దీనిపై విమర్శలు ఎదురైనా తాను దళితులకు సీటిచ్చానని చెప్పుకోవడానికి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారన్న టాక్‌ నడుస్తోంది. కానీ, దళిత ఎమ్మెల్యేలు తనకు అండగా నిలబడడం ద్వారా దళిత ప్రతినిధిగా గెలిపించుకోవాలని వర్ల కోరుతున్నారు.