గురుశిష్యులు భూమన, చెవిరెడ్డిల మధ్య కోల్డ్ వార్.. కారణం ఆ పదవేనా?

గురుశిష్యులు భూమన, చెవిరెడ్డిల మధ్య కోల్డ్ వార్.. కారణం ఆ పదవేనా?

Reason Behind Cold War Between Bhumana Karunakar Reddy Chevi Reddy Bhaskar Reddy

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి… చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గురుశిష్యులే. చెవిరెడ్డి రాజకీయ ఎదుగుదలకు మూలకారణం భూమన. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ కు చెవిరెడ్డిని పరిచయం చేసి, వారి మధ్య అనుబంధం పెరగడానికి కారణం భూమన కరుణాకర్‌రెడ్డి. ఈ కారణంగానే కరుణాకర్‌రెడ్డి తన గురువు అని… చెవిరెడ్డి బాహాటంగానే చెబుతుంటారు. చిరంజీవి రాజీనామాతో 2012లో జరిగిన తిరుపతి ఉప పోరులో తొలిసారి భూమన ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోగా, 2019 ఎన్నికల్లో కేవలం 700 ఓట్ల ఆధిక్యంతో రెండవ సారి ఎమ్మెల్యే అయ్యారు.



గురువుకేమో ఒక్క పోస్టే, శిష్యుడికి మూడు పదవులు:
చెవిరెడ్డి మాత్రం 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుమార్లు చంద్రగిరి నుంచి ఘన విజయం సాధించారు. అక్కడ నుంచే ఈ ఇద్దరి మధ్య ఒక విధమైన స్పర్ధ ఏర్పడిందంటారు. పైగా మొన్నటి ఎన్నికల్లో విజయం తర్వాత చెవిరెడ్డిని ఒకటికి మూడు పదవులు లభించాయి. ఎమ్మెల్యే పదవికి తోడు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, టీటీడీ పాలకమండలి సభ్యత్వం… ఇలా అదనంగా మూడు పదవులు దక్కాయి. భూమన కేవలం ఎమ్మెల్యే పోస్ట్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి ఉండగానే… తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ పోస్ట్ సైతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దక్కింది. ఈ పదవి రీత్యా తిరుపతిలో చెవిరెడ్డి కార్యక్రమాలు, పర్యటనలు బాగా పెరిగాయి. ఈ పరిణామాలు భూమన అనుచరులకు కొంత ఇబ్బందిగా మారాయి.

తిరుపతిలో చెవిరెడ్డి పెత్తనం ఏంటన్న అసంతృప్తి:
తిరుపతిలో చెవిరెడ్డి పెత్తనం ఏంటన్న అసంతృప్తి భూమన వర్గం నుంచి మొదలైంది. నిజానికి భూమన మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయన పేరు పరిగణనలోకి రాకపోవడంతో భూమన అప్పట్లో బాగా నొచ్చుకున్నారని టాక్‌. తనకు పదవి రాకపోగా తన శిష్యుడికి ఇన్ని పదవులు రావడం కూడా భూమనకు ఒక రకంగా ఇబ్బందిగా మారింది. టైం బ్యాడ్… అన్న రీతిలో భూమన ప్రస్తుతం సర్దుకుపోతున్నారట. వైఎస్సార్‌కు అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరిగా మెలగిన భూమన కరుణాకర్‌రెడ్డికి ఈ పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అదే సమయంలో ఏ మాత్రం నిరుత్సాహం చెందకుండా నగరంలో తరచుగా పర్యటించేందుకు భూమన ప్రయత్నిస్తూనే ఉన్నారు.



గురు శిష్యులు పోటాపోటీ:
కొవిడ్ సహాయ కార్యక్రమాల్లో ఇటు భూమన, అటు చెవిరెడ్డి పోటాపోటీగా తిరుపతిలో పాల్గొనడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంత్రి నాని తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిని సందర్శించారు. మంత్రితో కలిసి పీపీఈ సూట్ ధరించి భూమన సైతం కొవిడ్ ఆసుపత్రిలోకి వెళ్లి కరోనా రోగులతో నేరుగా మాట్లాడారు. ఇది జరిగిన మూడు రోజులకు చెవిరెడ్డి సైతం పీపీఈ కిట్ ధరించి స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి రోగులను పరామర్శించారు. ఇలాంటి ఘటనలు ఇటీవల వరసగా చోటు చేసుకుంటున్నాయి. ముందు చెవిరెడ్డి వెళితే ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి వెళ్లడం… లేదా తొలుత కరుణాకర్ రెడ్డి వెళితే చెవిరెడ్డి మళ్లీ అదే పని చేయడం నగరంలో చర్చనీయాంశం అయ్యింది.

ఈ పరిణామాలు చివరకు ఎటు దారి తీస్తాయో అన్న టెన్షన్:
ఓ కరోనా రోగికి భూమన అంత్యక్రియలు నిర్వహించారు. చెవిరెడ్డి కూడా కొన్ని చోట్ల ఇదే తరహా కార్యక్రమం నిర్వహించారు. ఒకరి తర్వాత ఒకరు ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లు సందర్శిస్తున్నారు. నిజానికి కొవిడ్ సహాయ కార్యక్రమాల్లో వీరు పోటీ పడి పాల్గొనడం అభినందించదగ్గదే అయినా… ఈ పరిణామాలు చివరకు ఎలా దారి తీస్తుందో అన్న టెన్షన్ ఇరువురి అనుచరుల్లో నెలకొందట. కనిపించినప్పుడు ఈ ఇద్దరు సరదాగానే ఉంటున్నా… వాస్తవానికి వీరి మధ్య అంత సఖ్యత లేదని పార్టీలో టాక్ నడుస్తోంది. మొత్తంమీద ఈ గురుశిష్యుల వ్యవహారం జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిందని అంతా అనుకుంటున్నారు.