మూడు రాజధానుల నిర్ణయం దుర్మార్గం అన్నారు, నెల రోజులు తిరక్కుండానే వైసీపీలో చేరిపోయారు

మూడు రాజధానుల నిర్ణయం అస్సలు నచ్చలేదన్నారు. అంతకంటే దుర్మార్గం లేనే లేదన్నారు. అసలు జగన్‌ నిర్ణయమే సరైనది కాదని తెగేసి చెప్పేశారు. అమరావతి రైతులకు

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 10:16 AM IST
మూడు రాజధానుల నిర్ణయం దుర్మార్గం అన్నారు, నెల రోజులు తిరక్కుండానే వైసీపీలో చేరిపోయారు

మూడు రాజధానుల నిర్ణయం అస్సలు నచ్చలేదన్నారు. అంతకంటే దుర్మార్గం లేనే లేదన్నారు. అసలు జగన్‌ నిర్ణయమే సరైనది కాదని తెగేసి చెప్పేశారు. అమరావతి రైతులకు

మూడు రాజధానుల నిర్ణయం అస్సలు నచ్చలేదన్నారు. అంతకంటే దుర్మార్గం లేనే లేదన్నారు. అసలు జగన్‌ నిర్ణయమే సరైనది కాదని తెగేసి చెప్పేశారు. అమరావతి రైతులకు అండగా కడవరకూ పోరాడేస్తాననీ బీరాలు పలికారు. ఇదంతా జరిగి నెల రోజులు గడిచిందో లేదో.. జెండా మారిపోయింది.. రంగులు మారిపోయాయి. చివరకు మనిషే మారిపోయారు. కళ్లు మూసి తెరిచే లోపు వైసీపీ ఆఫీసులో తేలిపోయారు. 

వర్ల రామయ్యను పక్కన పెట్టి మరీ శాసనమండలికి నామినేట్‌:
గుంటూరు జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన నేతల్లో డొక్కా మాణిక్యవరప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రాయపాటి సాంబశివరావు ముఖ్య అనుచరునిగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేతగా ఎదిగారు. కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరినా వరప్రసాద్ మాత్రం కొన్నాళ్లు మౌనంగానే ఉండిపోయారు. ఎన్నికల అనంతరం రాయపాటి సోదరుల మాటతో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వరప్రసాద్‌కు చంద్రబాబు అగ్ర తాంబూలం వేశారు. పార్టీలో చేరిన వెంటనే రాష్ట్ర కనీస వేతనాల సంఘం చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అంతటితో ఆగకుండా అదే సామాజికవర్గానికి చెందిన వర్ల రామయ్యను సైతం పక్కనపెట్టి ఎమ్మెల్సీగా డొక్కాను శాసనమండలికి నామినేట్ చేశారు.

అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన డొక్కా:
ఈ విషయాలను పక్కన పెడితే.. ఇటీవల వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేయటంతో రాజధాని ప్రాంతవాసులు చేపట్టిన ఉద్యమాన్ని దగ్గరుండి నడిపించారు డొక్కా. అమరావతి రాజధాని ప్రాంతం గతంలో డొక్కా ప్రాతినిధ్యం వహించిన తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో స్ధానికులంతా డొక్కా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించటాన్ని చూసి మురిసిపోయారు. కానీ వాళ్ల మురిపెం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. రాజధానుల నిర్ణయంపై బిల్లు శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలక క్రమంలో అకస్మాత్తుగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో తెలుగుదేశం నేతలు కంగుతిన్నారు.

తాడికొండ సీటు అడిగితే పత్తిపాడు ఇచ్చారట:
మండలిలో వీరోచితంగా పోరాడతారని భావించిన డొక్కా అకస్మాత్తుగా హ్యాండివ్వడం చూసి వారంతా నివ్వెరపోయారు. తెర వెనుక ఏదో జరిగి ఉంటుందని భావించినా చంద్రబాబుతో సహా ఎవరూ డొక్కాపై ఎలాంటి విమర్శలు చేయలేదు. ఇంతలో ఏమైందో ఏమో గానీ అకస్మాత్తుగా మీడియా వారికి ఓ బహిరంగ లేఖను రాసి, వాట్సప్ గ్రూపులకు పంపారు. అందులోని సారాంశం ఏంటంటే.. 2019 ఎన్నికల్లో తాడికొండ సీటు అడిగితే పత్తిపాడు సీటు ఇచ్చారని.. అదే తాను మానసికంగా వైసీపీ వైపు మొగ్గు చూపడానికి కారణమైందనేలా ఉందే తప్ప టీడీపీని పూర్తిగా విభేదిస్తున్నట్టుగా లేదంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డొక్కా తమ పార్టీలో చేరడం వల్ల పెద్దగా ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని వైసీపీ వర్గాలే అంటున్నాయి. తాను ప్రాతినిధ్యం వహించిన రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఎన్నికలు లేకపోవడమే దీనికి కారణమంట. 

డొక్కా నిర్ణయాన్ని పట్టించుకోని టీడీపీ, రాయపాటి:
డొక్కా వెళ్లిపోవడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదన్నది టీడీపీ అభిప్రాయంగా కనిపిస్తోంది. గురువు రాయపాటి కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకునే పరిస్ధితుల్లో లేరట. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో ఉండటం వల్ల తన రాజకీయ జీవితానికి కొనసాగింపు ఉండదని భావించే డొక్కా మాణిక్యవరప్రసాద్ అధికార వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాకపోతే మూడు రాజధానుల వ్యవహారంపై మనస్తాపం చెందానని, అందుకే ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పిన డొక్కా.. అందుకు కారణమైన వైసీపీలో చేరడమే విచిత్రంగా ఉందని జనాలు అంటున్నారు.

See Also | టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే