టీడీపీ ఫైర్ బ్రాండ్‌కు ఏమైంది? ఎందుకు సైలెంట్ అయ్యారు? కారణం చంద్రబాబేనా?

  • Published By: naveen ,Published On : September 1, 2020 / 04:03 PM IST
టీడీపీ ఫైర్ బ్రాండ్‌కు ఏమైంది? ఎందుకు సైలెంట్ అయ్యారు? కారణం చంద్రబాబేనా?

payyavula keshav : అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ రాష్ట్రంలోనే చురుకైన రాజకీయ నాయకుడిగా పేరు పొందారు. టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి తన వాగ్ధాటితో పార్టీ గౌరవాన్ని కాపాడిన గుర్తింపు ఆయనది. కేశవ్‌ని పార్టీ నేతలు ఫైర్ బ్రాండ్‌గా పిలుచుకుంటూ ఉంటారు. పార్టీ యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు. ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేయడంలో దిట్ట. అందుకే పార్టీకి సంబంధించిన మహానాడు కావచ్చు లేదా ఇతర పెద్ద సభల్లో కేశవ్‌నే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. అతి చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించారు. ఉరవకొండ నుంచి వరుసగా ఆరు సార్లు పోటీ చేసి, నాలుగుసార్లు విజయం సాధించారు. రెండుసార్లు ఓటమి చెందారు.



ఆవేశంతో కాకుండా ఆలోచనతో సెటైరికల్‌గా మాట్లాడే ప్రతిభాశాలి:
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా కేశవ్ ఓడిపోవటం ఆయన దురదృష్టమనే చెప్పాలి. గెలిస్తే ఆయన మంత్రి కావడం ఖాయమని అంతా అనుకున్నారు. ఆయన తండ్రి పయ్యావుల వెంకటనారాయణ 1975లో రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఎన్నికల్లో కేవలం 46 అసెంబ్లీ స్థానాలు గెలిచింది.

అప్పుడు పయ్యావుల కేశవ్ శాసనసభలో తన సత్తా చూపారు. ఆనాటి వైఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసేవారు. కేవలం ఆవేశంతో కాకుండా ఆలోచనతో సెటైరికల్‌గా ఆయన మాట్లాడే మాటల బాణాలు ఆనాటి అధికారపక్షానికి గట్టిగా తగిలేవి. అలాంటి నాయకుడు ఇప్పుడు సైలెంట్‌గా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది.

కేశవ్ స్పీచ్ ని వైఎస్ ఆసక్తిగా వినేవారు:
అప్పట్లో సీఎంగా ఉన్న వైఎస్సార్‌ సైతం కేశవ్ స్పీచ్‌ని ఆసక్తిగా వినేవారు. పయ్యావుల కేశవ్ టీడీపీ విప్‌గా వ్యవహరిస్తూ శాసనసభ్యులందరినీ సమన్వయపరుస్తూ తన పాత్ర సమర్థంగా నిర్వహించేవారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి కూడా టార్గెట్ అయ్యారు. నియోజకవర్గంలో అనేక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఆనాడు వైఎస్ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టినప్పుడు కేశవ్ చాలా కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు సైతం ప్రతి అంశంలోనూ కేశవ్ సలహాలు తీసుకునేవారు. 2009 ఎన్నికల్లో కేశవ్‌ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నించింది. అయినా ఆయన గెలిచారు.

కేశవ్ ఎందుకు సైలెంట్ అయ్యారు?
తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పార్టీ అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కేశవ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు పార్టీని కాపాడుకునేలా చంద్రబాబుకి సలహాలు ఇచ్చేవారు. ఆంధ్ర టీడీపీ నాయకులంతా కలిసి బస్సుయాత్ర చేసి, ఈ ప్రాంత ప్రజల్లో నమ్మకం కలిగించారు. అదే పార్టీకి కలిసి వచ్చిందని, 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కారణమైందని టీడీపీ నేతలు చెబుతుంటారు. అటువంటి కీలక పాత్ర పోషించిన పయ్యావుల కేశవ్ ఇప్పుడు మౌనంగా ఉండిపోవడానికి కారణం ఏమై ఉంటుందనే చర్చ టీడీపీ కేడర్‌లో సాగుతోంది.

కేశవ్ మౌనానికి చంద్రబాబే కారణమా?
2014లో ఓటమి కేశవ్‌కి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో గెలిస్తే కనుక ఎట్టి పరిస్థితిలో మంత్రి అయ్యేవారని ఆయన అనుచరులు ఆశించారు. పార్టీ అధినేత చంద్రబాబు సైతం అధికారంలో ఉన్న ఐదేళ్లూ పయ్యావులను దూరంగా పెట్టారు. ఆనాడు అధినేత వ్యవహరించిన తీరు ఇప్పుడు కేశవ్‌ సైలెన్స్‌కు ఒక కారణంగా చెబుతున్నారు. 2004, 2009లో గెలిచి అసెంబ్లీలో పార్టీ వాయిస్‌ని గట్టిగా వినిపించిన వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం దక్కలేదనేది కేశవ్‌ వర్గీయుల వాదన. పార్టీ కోసం గట్టి వాయిస్‌ని వినిపిస్తూ అధికార పార్టీకి టార్గెట్‌గా మారి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా ఓడిపోయారనే సాకుతో పక్కన పెట్టేయడం కరెక్ట్‌ కాదని అంటూ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి పదవి ఇవ్వలేదనే బాధ:
పరిటాల సునీతకు మంత్రి పదవి ఇవ్వడం పట్ల కేశవ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట సునీతకు మంత్రి పదవి ఇచ్చినా తర్వాత అయినా తనకు వస్తుందని కేశవ్ భావించారు. కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఆయన వర్గంలో అసంతృప్తి పెరిగిపోయింది. ఎమ్మెల్సీ ఇచ్చి చీఫ్ విప్‌గా అవకాశం ఇచ్చినా మంత్రి పదవి ఇస్తే కష్టానికి తగిన గౌరవం ఉండేదన్నది కేశవ్‌ అనుచరుల వాదన. ఇవన్నీ మనసులో పెట్టుకునే పయ్యావుల కేశవ్ 2019 తర్వాత వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని సమాచారం.

గతంలోలా ఇప్పుడు విరుచుకుపడటం లేదు:
ప్రతిపక్షానికి దక్కే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి టీడీపీలో పోటీ ఏర్పడింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కేశవ్ ఇద్దరూ ఆ పదవిని కోరుకున్నారు. కేశవ్‌ని ఎంపిక చేశారు చంద్రబాబు. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కేశవ్ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. గతంలో ప్రతిపక్ష హయాంలో ఉన్నప్పుడు చూపించిన జోరు చూపించడం లేదు.

కేశవ్ ఇప్పుడు కేవలం తన సొంత నియోజకవర్గమైన ఉరవకొండ మీదే పూర్తి ఫోకస్ పెట్టారట. అధికార పార్టీకి భయపడి మాట్లాడటం లేదని కొందరు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉండగా అధిష్టాననం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల కొందరు నేతలు మౌనంగా ఉంటున్నారని వాపోతున్నారు తెలుగు తమ్ముళ్లు.