రాఖీతో రోజా మార్క్ సెంటిమెంట్ పండిందా? అసలు ఫైర్ బ్రాండ్ వ్యూహం ఏంటి?

  • Published By: naveen ,Published On : August 7, 2020 / 11:52 AM IST
రాఖీతో రోజా మార్క్ సెంటిమెంట్ పండిందా? అసలు ఫైర్ బ్రాండ్ వ్యూహం ఏంటి?

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏమి చేసినా సంచలనమే. ఓ సాధారణ యువతి నుంచి టాప్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో సినీ రంగంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆమె కష్టాలు తీరలేదు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన రోజా సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు.



వరుసగా రెండు మార్లు గెలిచి తన సత్తా చాటారు. రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎందుకనో రోజా అంత సంతోషంగా లేరంటున్నారు. విపక్షంలో ఉన్న ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డానని, అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి ఖాయమని భావించారు. కానీ, కేబినెట్లో చోటు దక్కలేదు. కొన్నాళ్లు ఆమె సైలెంట్ అయిపోయి, అలకబూనడంతో సీఎం జగన్ ఆమెకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పోస్ట్ కట్టబెట్టారు. అయినా కూడా రోజాలో ఏదో తెలియని వెలితి మిగిలిపోయిందంటున్నారు.

MLA Roja's voice message proves the rift between the leaders of ...

రోజా శత్రువులకు పెద్దిరెడ్డి అండదండలు?
మరోపక్క, రాజకీయంగా జిల్లాలో తనను అణగదొక్కడానికి కొందరు చూస్తున్నారని, తనను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న భావన రోజాలో బాగా ఉందంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఆమె బయటపెట్టారు కూడా. ఇదే క్రమంలో జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో తొలుత పేచీ పడింది. ఒక దశలో ఆయనతో డైరెక్ట్ ఫైట్ కు సిద్ధపడ్డారు రోజా. మొన్నటి ఎన్నికల్లో తనను ఓడించాలని చూశారంటూ పెద్దిరెడ్డి అండ్ కోపై ఆమె తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. నగరిలో వరుసగా రోజా రెండుమార్లు గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్థానిక ముఖ్య నేతలతోనూ రోజాకు ఇప్పుడు మాటల్లేవట. తన శత్రువులకు పెద్దిరెడ్డి అండదండలు ఉన్నాయన్నది రోజా అనుమానం.



రోజాకు చెప్పాల్సిన అవసరం లేదు ...

డిప్యూటీ సీఎంతోనూ గొడవ:
ఈ వ్యవహరం అధిష్టానం దృష్టికి వెళ్ళింది. పెద్దిరెడ్డితో గొడవ వద్దని, ఆయన్ను కలుపుకొని పోవాలని రోజాకు అధిష్టానం సూచించడంతో ఆ వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితోనూ రోజాకు గొడవ ఏర్పడింది. తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమాలకు హాజరు అవుతున్నారంటూ రోజా మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించేందుకు తనకు అధికారం ఉందని నారాయణస్వామి అంతే ఘాటుగా బదులివ్వడం ఒకే రోజు జరిగిపోయింది.



MLA Roja Ties Rakhi To MP Mithun Reddy In Tirupati - Sakshi

రోజా ఊహించని ట్విస్ట్, రాఖీ కట్టి కాళ్లకు నమస్కారం:
జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యులతో రోజా ఈ స్థాయిలో పేచీలు పెట్టుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజానికి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలతో రోజాకు ఎందుకనో మొదటి నుంచీ సఖ్యత లేదు. వారితో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఏకంగా పెద్దిరెడ్డితోనే గొడవ పెట్టుకోవడంతో ఆమెతో మనకెందుకులే అని మిగతా ఎమ్మెల్యేలు ఆమెకు కాస్త దూరంగానే ఉంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంతో రోజాకు ఉన్న తగువు బహిరంగ రహస్యమే. అలాంటిది రోజా ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయారు. రాఖీ పండుగ నాడు ఓ అనూహ్య ఘటనకు ఆమె తెరతీశారు. నేరుగా తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లారు. పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి రాఖీ కట్టారు. ఆయనకు స్వీట్ తినిపించారు. ఏకంగా మిథున్ రెడ్డి కాళ్లకు నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

rojaselvamani hashtag on Twitter



రాఖీతో రోజా రాజీకి వచ్చిందా?
ఈ అనూహ్య సంఘటనతో అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారట. రోజా ఏంటి… ఇక్కడకు రావడం ఏంటి… రాఖీ కట్టి కాళ్లపై పడడం ఏంటని అంతా కాసేపు షాక్ లో ఉండిపోయారట. రాఖీతో రోజా రాజీకి వచ్చిందా? అని అంతా చెవులు కొరుక్కున్నారు. ఇంతకీ రోజా ఇలా ఎందుకు చేసిందో ఎవరికీ అర్థం కావడం లేదట. మిథున్ రెడ్డి కూడా కాసేపు తేరుకోలేక పోయారని చెబుతున్నారు. ఈ రాఖీతో మరి పాత గొడవలు సమసిపోయినట్లేనా అని అంతా చర్చించుకుంటున్నారు. పెద్దిరెడ్డి కుటుంబంతో గొడవలకు స్వస్తి పలకాలనే రోజా ఈ పని చేశారా? లేక మరేదైనా రోజా మైండ్ లో ఉందా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలని కార్యకర్తలు అంటున్నారు. ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్.