మా తడాఖా చూపిస్తాం : అనంత టీడీపీలో అసమ్మతి జ్వాల

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 02:54 PM IST
మా తడాఖా చూపిస్తాం : అనంత టీడీపీలో అసమ్మతి జ్వాల

అనంతపురము: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో .. తెలుగు తమ్ముళ్ళ  మధ్య అసమ్మతి సెగలు .. అభ్యర్థులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలతో పాటు 14 చోట్ల టీడీపీ అభ్యర్థులకు .. రెబల్స్ బెడద తప్పడం లేదు. టికెట్లు ఆశించి భంగపడ్డవారు కొందరైతే .. ఐదేళ్ళ కాలంలో తమను రాజకీయంగా ఎదగకుండా అణచివేశారంటూ .. కొంతమంది తెలుగు తముళ్ళు అసమ్మతి స్వరం పెంచారు. ఏకంగా రోడ్డెక్కి రెబల్స్‌గా బరిలోకి దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు.   

అనంతపురం జిల్లాలో అత్యధిక స్ధానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు…తముళ్ళను ఎన్నికలకు సిద్ధం చేస్తుంటే .. అసమ్మతి వర్గాలు ఏకంగా నామినేషన్లకు దిగుతున్నాయి. కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ తమకు కేటాయించి .. చివరి నిమిషంలో జేసీ దివాకర్ రెడ్డి, పయ్యావుల కేశవ్ ఒత్తిడితో ఉమామహేశ్వరనాయుడుకు ఇచ్చారని ఎస్ఆర్‌ కన్‌స్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబు నాయుడు అనుచరులు ఆరోపిస్తున్నారు. 2014లోనూ తమకు అనంతపురం టికెట్ కేటాయించి .. నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న అనంతరం .. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో కూడా కళ్యాణదుర్గం టికెట్ కేటాయిస్తున్నామని, ప్రచారానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారని తెలిపారు. తెల్లవారేలోగా టికెట్‌ను ఉమామహేశ్వర నాయుడుకు కేటాయించారని ఆరోపించారు. తమకు ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో పదే పదే అడ్డుపడుతూ అన్యాయం చేస్తున్న పయ్యావుల కేశవ్‌కు వ్యతిరేకంగా .. స్వతంత్ర్య అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబు పోటీకి సిద్ధమవుతున్నారని చెప్పారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇప్పటికే తాజా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు రెబల్స్‌గా నామినేషన్ దాఖలు చేశారు. అనంతపురం నియోజకవర్గం నుంచి జయరాంనాయుడు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు అనుచరులు ప్రకటించారు.

గుంతకల్లు నియోజకవర్గంలో సైతం మున్సిపల్ ఛైర్మన్ కోడల అపర్ణ అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శింగనమల, కదిరి, ధర్మవరం, రాయదుర్గం, తాడిపత్రి నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. అసమ్మతి నేతలు టీడీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. కొంతమంది పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారు. మరికొంతమంది పార్టీలోనే ఉంటూ ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా మెజార్టీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు అసమ్మతి సెగలు చుక్కలు చూపిస్తున్నాయి.

నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి అన్ని సర్దుకుపోతాయని అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెబుతున్నా .. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థులకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఏమాత్రం పొసగడం లేదు. ఎవరికివారు ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నారు. టీడీపీలో నెలకొన్న అసమ్మతి స్వరం .. అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.