బస్సుల తగ్గింపు : మెట్రో జోష్

  • Published By: madhu ,Published On : December 22, 2019 / 02:36 AM IST
బస్సుల తగ్గింపు : మెట్రో జోష్

నగరంలోని కొన్ని సిటీ బస్సుల రద్దు మెట్రోకు కలిసొచ్చింది. ఫుల్ జోష్‌తో పరుగులు తీస్తోంది. రోజుకు రోజుకు ప్రయాణీకుల సంఖ్య పెరుగుతోంది. ప్రధాన మార్గాల్లో బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ప్యాసింజర్లు మెట్రో వైపు చూస్తున్నారు. కొద్ది రోజులుగా మెట్రో ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సుమారు వేయి బస్సులను రద్దు చేసేందుకు నిర్ణయించిన గ్రేటర్ ఆర్టీసీ..దశల వారీగా బస్సుల సంఖ్యను తగ్గిస్తోంది.

ఇప్పటి వరకు 600 బస్సులను రద్దు చేసినట్లు, దశల వారీగా బస్సులను సంఖ్యను తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాత్రి వేళల్లో సిటీ బస్సులు అరకొరగా తిరుగుతుండడంతో ప్రయాణీకులు అష్టకష్టాలు పడుతున్నారు. మెట్రో రైళ్లు మాత్రం రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉండడంతో ప్రయాణీకులకు కాస్త ఊరటనిచ్చినట్లైంది. అయితే..శివారులో ఉండే వారు మాత్రం పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

వారం రోజులుగా మరో 24 వేల మంది ప్రయాణీకులు పెరిగినట్లు మెట్రో అంచనా వేస్తోంది. ఓ వైపు ఛార్జీల పెంపు వల్ల కొంత మేర ఆర్టీసీ ఆదాయం పెరిగినా..బస్సులను తగ్గిస్తుండడంతో కొంతమంది ప్రయాణీకులను కోల్పోవాల్సి వస్తోంది. ఆర్టీసీ సమ్మె కాలానికి 3 లక్షలు ఉన్న ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పెరిగి 4.24 లక్షల మందికి చేరింది. హైటెక్ సిటీ నుంచి రోజుకు సుమారు 6 వేల 125 మంది రాకపోకలు సాగిస్తున్నారని, అమీర్ పేట నుంచి మరో 4 వేల 102 మంది మెట్రో సేవలను వినియోగిస్తున్నట్లు అంచనా.

సిటీ బస్సుల ట్రిప్పులను తగ్గించే కొద్దీ..ఈ సంఖ్య మరింత పెరిగే సూచనలున్నాయని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ట్రయల్ రన్ నడుస్తున్న జేబీఎస్ – ఎంజీబీఎస్ కారిడార్‌లో జనవరి చివరి వారంలో మెట్రో సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి ఏంజీబీఎస్, జేబీఎస్‌కు చాలా మంది వెళుతుంటారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే..ప్రయాణీకుల సంఖ్య 5 లక్షలకు చేరుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
Read More : సంక్రాంతికి JBS – MGBS మెట్రో