నా పైసలు నాకిచ్చేయండి : ఓడిపోయిన అభ్యర్థి డిమాండ్

దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. నాకే ఓటెయండి. ఇగో ఈ 500 తీసుకో.. ఈ 100 తీసుకో.. అంటూ ఎన్నికల ముందు ఓటర్లకు డబ్బులిచ్చారు. ఇప్పుడు ఓడిపోగానే.. నా పైసలు

  • Published By: veegamteam ,Published On : January 28, 2019 / 02:36 PM IST
నా పైసలు నాకిచ్చేయండి : ఓడిపోయిన అభ్యర్థి డిమాండ్

దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. నాకే ఓటెయండి. ఇగో ఈ 500 తీసుకో.. ఈ 100 తీసుకో.. అంటూ ఎన్నికల ముందు ఓటర్లకు డబ్బులిచ్చారు. ఇప్పుడు ఓడిపోగానే.. నా పైసలు

నల్గొండ: దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. నాకే ఓటెయండి. ఇగో ఈ 5వందలు తీసుకో.. ఈ వంద తీసుకో.. అంటూ ఎన్నికల ముందు ఓటర్లకు డబ్బులిచ్చారు. ఇప్పుడు ఓడిపోగానే.. నా పైసలు నాకు ఇచ్చేయండి అంటూ ఓటర్ల ఇంటి ముందు ప్రదక్షిణలు చేస్తున్నారు. నువ్వు నాకు ఓటేసినవా.. వేయలే కదూ. నువ్వు ఓటేస్తే నేను ఓడిపోకపోదును.. నువ్వేకాదు ఈ వాడల నాకు ఎవ్వలూ ఓటెయ్యలేదు. కాబట్టి ఎన్నికలప్పుడు నేను మీకిచ్చిన నా పైసలు నాకు ఇచ్చేయండి. అంటూ ఓటర్ల వెంటపడుతున్నారు.. ఓడిపోయిన అభ్యర్థులు. ఎన్నికలకు ముందు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు డబ్బు పంచుతూ, విందు ఇస్తూ భారీగా ఖర్చు చేసిన అభ్యర్థులు.. ఓడిపోయాక ఆ డబ్బును రికవరీ చేసుకునే పనిలో పడ్డారు. మిమ్మల్ని నమ్మి ఎంతో ఖర్చు చేస్తే మాకు మిగిలిందేమీ లేదంటున్నారు… ఓటర్లకు ఖర్చు చేసిందంతా వారి దగ్గరికి వెళ్లి మళ్లీ వసూలు చేస్తున్నారు.

 

సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డి గూడెంలో ఒక వార్డుకి కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఉప్పు ప్రభాకర్ ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. వార్డు మెంబర్ ఎన్నికల్లో ఓడిపోయి పొగొట్టుకున్న డబ్బు రికవరీ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి నా పైసలు నాకు ఇచ్చేయండి అని డిమాండ్ చేస్తున్నాడు.

 

పోయిన చోటే వెతుక్కోమన్నారు పెద్దలు.. ఇది కరెక్ట్ అనుకున్నారో ఏమో.. ఇచ్చిన డబ్బు కక్కేయడంటూ ఓటర్ల చుట్టూ బస్తాలు పట్టుకుని తిరుగుతున్నారు ఓడిపోయిన అభ్యర్థులు. కొన్ని ప్రాంతాల్లో అయితే మహిళలకు పంచిన చీరలు, కుంకుమ భరిణెలు వంటి వస్తువులను కూడా తిరిగి ఇచ్చేయాలని అడుగుతున్నారు. డబ్బు రికవరీకి వచ్చిన అభ్యర్థులను చూసి ఓటర్లు అవాక్కవుతున్నారు. మేం మీ దగ్గరికి వచ్చి పైసలు అడిగామా.. మీరే వచ్చి ఇచ్చారు. మీరు ఓడిపోతే మేం ఎందుకు బాధ్యులమవుతామంటూ ఎదురు ప్రశ్నలేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఓటర్లకు-అభ్యర్థులకు మాటా మాటా పెరిగి పోలీసు స్టేషన్‌ వరకూ వెళ్లిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.