రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం! : ఢిల్లీలో సచిన్ పైలట్ సహా మరికొందరు ఎమ్మెల్యేలు

  • Published By: venkaiahnaidu ,Published On : July 12, 2020 / 02:44 PM IST
రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం! : ఢిల్లీలో సచిన్ పైలట్ సహా మరికొందరు ఎమ్మెల్యేలు

రాజస్థాన్‌లో రాజకీయ కలకలం మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించిన కొన్ని గంటల్లోనే రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ చేరుకున్నారు.

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై ఆగ్రహంతో ఉన్న యువ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్.. మధ్యప్రదేశ్ సింధియా రాజకీయాన్ని వంటబట్టించుకున్నట్టు కనిపిస్తున్నది. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, ఏదో ఒకటి తేల్చుకునేందుకు ఈ యువ నేత సోనియాగాంధీతో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ పయనమై వెళ్లాడు. రాజస్థాన్ ప్రభుత్వంలో ముదురుతున్న సంక్షోభం గురుంచి పార్టీ హైకమాండ్ తో మాట్లాడేందుకే సచిన్ పైలట్ తన వర్గంలోని ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.

సోనియా, రాహుల్ గాంధీ ఇద్దరికీ పరిస్థితి గురించి వివరించబడినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై సోనియా గాంధీ స్పందిస్తారని, విభేదాలు ఏమైనప్పటికీ అందరూ కలిసి పనిచేయాలి అని ఓ ముఖ్య నాయకుడు అన్నారు.

రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ..ఎమ్మెల్యేలకు రూ .15 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ప్రశ్నించేందుకు సమన్లు ​​ఇవ్వడంపై కలత చెందిన సచిన్ పైలట్

ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆరోపణలపై ప్రశ్నించేందుకు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్​ఓజీ) సమన్లు ​​ఇవ్వడంపై సచిన్ పైలట్ అప్ సెట్ అయ్యాడు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలపై దర్యాప్తులో భాగంగా సచిన్ పైలట్‌ విచారణకు హాజరు కావాలని కోరిన లేఖ.. కాంగ్రెస్ సంక్షోభాన్ని బ్రేకింగ్ పాయింట్‌కు నెట్టివేసిందని భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల ముందు రాజస్థాన్ చీఫ్ విప్ మహేష్ జోషి ఇచ్చిన ఫిర్యాదుపై సచిన్ పైలట్‌ కు రాజస్థాన్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ మరియు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ నుంచి శుక్రవారం సమన్లు జారీ చేయబడ్డాయి .

మరోవైపు, కరోనా నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ విషయాలన్నిటి నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఈ నాటకాలు ఆడుతున్నారని రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా విమర్శించారు. ఇదిలాఉండగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలకు సంబంధించి ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజి) అశోక్ సింగ్, భారత్ మలానీ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాజస్థాన్ అదనపు డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ రాథోడ్ తెలిపారు.