Telugu News
లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

శైలజానాధ్ రాకతో హస్తం దశ తిరుగుతుందా ?

Publish Date - 3:36 pm, Thu, 16 January 20

sailajanath as ap pcc chief

చాలా కాలంగా ఖాళీగా ఉన్న  ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా  అనంతపురం జిల్లాకు చెందిన దళిత నేత , ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ సాకే శైలజానాధ్ ను  నియమించారు పార్టీ అధ్యక్షురాలుసోనియా గాంధీ. 2014లో  రాష్ట్ర విభజన తర్వాత అంపశయ్యపై ఉన్నపార్టీకి  రఘువీరారెడ్డి నాయకత్వం బాధ్యతలు చేపట్టారు. ఆయన అధ్యక్షుడిగా నియమితులయ్యాక  వచ్చిన 2014, 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింది.  2019 ఎన్నికల్లో ఐతే నోటా కంటే తక్కువ ఓట్లు పార్టీకి పోలయ్యాయి. దీంతో పార్టీ అపజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రఘువీరారెడ్డి  జులై3, 2019లో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.  అప్పటినుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన పార్టీగా కాంగ్రెస్‌పై ఏపీ ప్రజలు 2014 ఎన్నికల్లోనే కక్ష తీర్చుకున్నారు. మళ్లీ 2019 లోనూ అదే పునరావృతం అయ్యింది. అప్పటివరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏకంగా ‘సున్నా’కు పరిమితం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆ దెబ్బ నుంచి కోలుకోలేదు.

రఘువీరా రెడ్డి రాజీనామా చేసిన తర్వాత పీసీసీ అధ్యక్ష రేసులో కేంద్ర మాజీ మంత్రి ఎం.పళ్లంరాజు తో పాటు మరి కొందరి నేతల పేర్లు కూడా వినిపించాయి. వారిలో మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్, మాజీ మంత్రి శైలజానాథ్, ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన సుంకర పద్మ, గిడుగు రుద్రరాజు కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్టు అప్పుడు వార్తలు వచ్చాయి. కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఆతర్వాత పార్టీలో చేరిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరిగినా ఆయనా ఆసక్తి కనపరచకపోవటంతో ఆ స్ధానాన్ని ఏఐసీసీ పూరించలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పేరుతో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీకి 2014 ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఆదరణ రాకపోవటంతో 2018 లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ  175 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా ఎక్కడా డిపాజిట్లు రాలేదు. కళ్యాణదుర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డికి కేవలం 28,883 ఓట్లు పోలయ్యాయి. కాగా..ఇప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన శైలజా నాధ్ 2019 సాధారణ ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఎంతగా అంటే ఆయనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ నియోజక వర్గంలో మొత్తం 1,97,466 ఓట్లు పోల్ అవగా అందులో ఆయనకి 1,384 ఓట్లు మాత్రమే  వచ్చాయి. ఇక్కడ నోటాకు 2,304 ఓట్లు పడ్డాయి. అంటే నోటాకు వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే శైలాజానాథ్‌కు చాలా తక్కువ ఓట్లు రావడంతో  అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. 

శైలజానాధ్ రెండు సార్లు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004,2009లో ఆయన అనంతపురం జిల్లా మడకశిర నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి శమంతక మణిని ఓడించారు. 2009 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండో సారి సీఎం అయిన వెంటనే ఉమ్మడి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుండి విప్ లుగా అవకాశం కల్పించారు. తెలంగాణకు చెందిన మల్లు భట్టివిక్రమార్క కు చీఫ్ విప్ గా..అదే విధంగా రాయలసీమ నుండి శైలజానాద్..ఉత్తరాంధ్ర నుండి కోండ్రు మురళీలను విప్ లుగా నియమించారు.

ఇక… వైయస్సార్ మరణం..ఆ తరువాత రోశయ్య సీఎం అయిన సమయంలోనూ ఆయన విప్ గానే కొనసాగారు. అప్పుడు ఏపీలో సమైక్యాంధ్ర జేఏసీ ఛైర్మన్ గా శైలజానాధ్ వ్యవహరించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అనంతపురం జిల్లా నుండి రఘువీరాతో పాటుగా శైలజా నాద్ మంత్రిగా ఆయన కేబినెట్ లో ఛాన్స్ దక్కించుకున్నారు. తొలిసారి మంత్రి అయిన శైలజా నాధ్ ప్రాధమిక విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తన వాయిస్ వినిపించారు.

 కాగా..  ఇప్పుడు ఏపీ కి పీసీసీ చీఫ్ గా శైలజానాద్ ను నియమించిన ఏఐసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇద్దరికి అవకాశం కల్పించింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన తులసి రెడ్డి..అదే విధంగా కోస్తా ప్రాంతానికి చెందిన మైనార్టీ నేత..మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ లో ఏ నేత యాక్టివ్ గా లేరు. ప్రస్తుతం జరుగుతున్న రాజధాని వివాదం పైనా పార్టీ వాయిస్ ప్రస్తుతానికి టీవీ చర్చల్లోనూ.. బయటా రెగ్యులర్ గా తులసి రెడ్డి..అప్పుడప్పుడూ శైలజా నాధ్ వినిపిస్తున్నారు. దీంతో..ఎస్సీ వర్గానికి చెందిన రాయలసీమ నేతకు కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించింది.

రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన పాపం మూటకట్టుకున్న కాంగ్రెస్ పార్టీని  గడిచిన 2 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు  చిత్తుగా ఓడించారు.  ఏపీలో అడ్రస్  గల్లంతై ఐసీయూ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి  ఇప్పుడు శైలజా నాద్ అధ్యక్షుడిగా ఏ మేర చికిత్స చేయగలుగుతారనేది  వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా కనీసం నాలుగేళ్లు సమయం ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో 2024 ఎన్నికలలోపు  పార్టీని సమయాత్తం చేసే ప్రజల్లోకి వెళ్లేలా  కేడర్ లో ఉత్సాహాన్నినింపే బాధ్యత శైలజానాథ్‌పై పడింది. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ,లతో పాటు కొత్తగా పొత్తు పెట్టుకున్న బీజేపీ, జనసేన లను  కూడా తట్టుకొని పార్టీ కేడర్‌ను ఎంతవరకు  నిలబెట్టగలరు అనేది వేచి చూడాలి.