కర్నూలు కాంగ్రెస్‌కి షాక్ : టీడీపీలోకి కోట్ల

  • Edited By: chvmurthy , January 28, 2019 / 11:13 AM IST
కర్నూలు కాంగ్రెస్‌కి షాక్ : టీడీపీలోకి కోట్ల

కర్నూలు: కర్నూలు జిల్లా కాంగ్రెస్  పార్టీకి పెద్ద  దెబ్బ తగలబోతోంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ లో చేరతున్నారు. తన భార్య సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్ర రెడ్డితో కలిసి  సోమవారం రాత్రి చంద్రబాబునాయుడును ఉండవల్లి లోని ఆయన ఇంటిలో కలవనున్నారు. 

కర్నూలు  పార్లమెంట్ స్ధానంతో పాటు, డోన్ , కోడుమూరు అసెంబ్లీ స్దానాలను  కోట్ల ఫ్యామిలీ అడుగుతోంది.  టీడీపీ కి చెందిన పలువురు నేతలు  కోట్లతో  గత 3 రోజులుగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు నాయుడు కోట్ల పార్టీలోకి వస్తున్న విషయాన్ని ప్రస్తావించగా, బలమైన నేతలు పార్టీలోకి వస్తే మంచిదే అని మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

కోట్లకు మద్దతుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు.  సూర్యప్రకాషరెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనకు కట్టుబడి ఉంటామని కార్యకర్తలు చెపుతున్నారు. కోట్ల  కోరుతున్న వాటిలో డోన్అసెంబ్లీ స్ధానం పైనే కాస్త సందిగ్ధత ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, కర్నూలు పార్లమెంట్, కోడుమూరు  టికెట్ల విషయంలో ఎటువంటి ఇబ్బందిలేకపోయినా డోన్ విషయమై చంద్రబాబు కేఈ కృష్ణమూర్తితో చర్చించాల్సి ఉంటుంది.