అన్న వర్సెస్ తమ్ముడు:బొబ్బిలి బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా చిచ్చు

విజయనగరం: బొబ్బిలి రాజా సోదరుల మధ్య సోషల్ మీడియా చిచ్చు రాజేస్తోందా.. అన్నదమ్ముల అనుబంధానికి బీటలు వారేలా చేస్తోందా.. రామలక్ష్మణులను తలపించే వీరి

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 02:12 PM IST
అన్న వర్సెస్ తమ్ముడు:బొబ్బిలి బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా చిచ్చు

విజయనగరం: బొబ్బిలి రాజా సోదరుల మధ్య సోషల్ మీడియా చిచ్చు రాజేస్తోందా.. అన్నదమ్ముల అనుబంధానికి బీటలు వారేలా చేస్తోందా.. రామలక్ష్మణులను తలపించే వీరి

విజయనగరం: బొబ్బిలి రాజా సోదరుల మధ్య సోషల్ మీడియా చిచ్చు రాజేస్తోందా.. అన్నదమ్ముల అనుబంధానికి బీటలు వారేలా చేస్తోందా.. రామలక్ష్మణులను తలపించే వీరి అనుబంధం.. రాజకీయాల పుణ్యమా అని రచ్చకెక్కాల్సి వస్తోందా.. అసలు బొబ్బిలి సోదరుల మధ్య రగిల్చిన చిచ్చు ఏంటి.. తమపై వస్తున్న ప్రచారంపై సంస్ధానాధీశులు ఏమంటున్నారు.

 

బొబ్బిలి సంస్థానం.. తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం అక్కర్లేని రాజస్థానం. 400 ఏళ్ల చెక్కు చెదరని చరిత్ర. నాటి రాచరిక వ్యవస్థను ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్న గొప్పతనం ఈ సంస్థానాదీశులది. ఎన్నో రాజ్యాలు, మరెందరో రాజులు కాలగర్భంలో కలిసిపోయినా.. నేటికీ బొబ్బిలి గడ్డ శౌర్యానికి మారు పేరుగా, వీరబొబ్బిలిగా చెప్పుకుంటారు. నాటి రాచరిక వ్యవస్థను కాపాడుకుంటూనే.. నేటి ప్రజాస్వామ్యంలోనూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ ప్రజాపాలనలో నాటి బొబ్బిలి వైభవాన్ని కాపాడుకుంటున్నారు. బొబ్బిలి సంస్థానాదీశుడు సుజయ కృష్ణ రంగారావు ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తుండగా, ఆయన సోదరుడు బేబీనాయన.. అన్నకు అండగా, సంస్థాన బాధ్యతలు చూసుకుంటున్నారు.

 

బేబీనాయనకు రాజకీయంగా నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది. బొబ్బిలి రాజ వంశీయులు కావడం, రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుండటంతో అందరికీ తలలో నాలుకలా మారారు. ఓ విధంగా చెప్పాలంటే నియోజకవర్గంలో అన్న సుజయకృష్ణ రంగారావు కంటే బేబీనాయనకే గట్టి పట్టు ఉంది. అన్నమాట తమ్ముడు జవదాటడు అన్న పేరుంది. కాని.. ఈమధ్య బొబ్బిలి రాజులపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బొబ్బిలి సోదరుల మధ్య మనస్ఫర్థలు తలెత్తాయని, వారి మధ్య దూరం పెరుగుతుందంటూ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ జనాల్లోకి వెళ్లడంతో.. ఇది కాస్తా బొబ్బిలి రాజులకు తలనొప్పిగా మారింది.

 

ఇన్నాళ్లూ అన్నకు రాజకీయ అండగా నిలిచిన బేబీనాయన.. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దీనిపై ఈమధ్య సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం సాగుతోంది. మీడియాలో వస్తున్న ప్రచారం ఆధారంగా కొన్ని మీడియా చానళ్లు, పత్రికల్లో కూడా థనాలు రావడం రాజవంశీకులను మరింత అయోమయానికి గురిచేస్తోంది. దీంతో బేబీనాయన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. తమ అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టేందుకు కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వివరణ ఇచ్చారు.

 

వాస్తవానికి బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ టికెట్టు ఆశిస్తున్న వారిలో మరో నేత కూడా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, దివంగత తెంటు జయ ప్రకాశ్ కుమారుడు తెంటు లక్ష్మునాయుడు తొలుత బొబ్బిలి టికెట్టు రేసులో ఉండేవారు. 2014 ఎన్నికల్లో కూడా తెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, సుజయ కృష్ణ రంగారావుపై ఓటమి చెందారు. సుజయ కృష్ణ రంగరావు వైసీపీ నుంచి టీడీపీలోకి రావడంతో .. తెంటు ప్రస్తుతం ఆ సీటుపై ఆశలు వదులుకున్నారు. దీంతో బొబ్బిలి అభ్యర్థిగా తిరిగి సుజయ కృష్ణ రంగారావే పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో.. బేబీనాయన పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

 

3సార్లు అన్నను ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన బేబీనాయన.. కేవలం అన్నని గెలిపించడానికే పరిమితమా అన్న ఫీలింగ్‌లో ఉన్నారనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇటువంటి ప్రచారాన్ని బేబీనాయన తన వీడియో ద్వారా కొట్టిపారేశారు. తమ మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేవని, ఇద్దరిదీ ఒకటే మాట అని క్లారిటీ ఇచ్చారు. బొబ్బిలి కోటపై టీడీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని చెప్పుకొచ్చారు. తాను పోటీ చేస్తానంటే అన్న సుజయ్‌ తృణప్రాయంగా తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆయన పోటీ చేస్తానంటే ఆయన వెనుక ఉండి నడుచుకుంటానన్నారు.

 

బేబీనాయన విడుదల చేసిన వీడియోలో ఎప్పుడూ చెప్పని ఓ కొత్త విషయాన్ని చెప్పడం ప్రజల్లో కొత్త అనుమానాలకు తావిచ్చింది. రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్నది కుటుంబంలో చర్చించుకుని నిర్ణయానికి వస్తామని, తాను పోటీ చేస్తానంటే అన్న తృణప్రాయంగా తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతూ.. తాను కూడా బరిలో ఉన్నానన్న సంకేతాన్ని ఇవ్వడం కొసమెరుపు. మరి బొబ్బిలి రాజుల మధ్య తలెత్తిన ఈ సోషల్ మీడియా వివాదం ఫేక్ అని తేలుతుందో… లేక నిజమవుతుందో చూడాలి.