ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ రెడీ

  • Published By: chvmurthy ,Published On : January 8, 2020 / 11:38 AM IST
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా  వైజాగ్ రెడీ

ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ రెడీగా ఉంది. పరిపాలనా  రాజధానిగా  ప్రతిపాదించిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తోంది. పరిపాలనా రాజధానిగా విశాఖను చేసుకోవాలన్న ఆలోచనకు ముందే పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది. పరిపాలనకు కావాల్సిన భవనాలు, మౌలిక వసతులు .. అన్ని కూడా అనుకున్నదే తడువుగా రంగంలోకి దిగేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. సీఎం క్యాంప్ ఆఫీస్ ను ఎక్కడ పెట్టాలి.. సెక్రటేరియట్ ను ఎక్కడ నుంచి నడపాలి అన్న కీలకాంశాలపై ఇప్పటికే స్పష్టతకు వచ్చిన ప్రభుత్వం, ఈ దిశగా చర్యలు చేపడుతోంది.

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తారని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. ప్రభుత్వ ఆఫీసులు, భూముల కోసం రాష్ట్రస్థాయి అధికారులు ఆ నగరంలో అన్వేషణ ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల ఆఫీసులకు అనువైన భవనాల కోసం అమరావతి నుంచి విశాఖకు వచ్చిన అధికారులు భవనాల వివరాలను సేకరించారు. తాత్కాలికంగా కార్యాలయాలు ఏర్పాటుకు అనుకూలమైన భవనాలు ఎక్కడన్నాయి? శాశ్వతంగా ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని వారు పరిశీలిస్తున్నారు. ఇన్నోవేషన్‌వ్యాలీ టవర్స్‌లో కొంత భాగం ఖాళీగా ఉండటంతో దానిని పరిశీలించిన ఐటీ అధికారులు.. సీఎం కార్యాలయానికి అనుకూలమని, పక్కనే ఉన్న మిలీనియం టవర్‌ సెక్రటేరియట్‌కు బాగుంటుందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ సంస్థల ప్రతినిధులతో అధికారులు భేటీ అయ్యారు. మధురవాడ ఐటీ హిల్స్‌లో ఉన్న భవనాలపైనా కూడా ఆరా తీశారు. 

మిలీనియం టవర్స్
విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో ఉన్న రుషికొండ ఐటీ పార్కులో గత ప్రభుత్వం నిర్మించిన మిలీనియం టవర్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. ఈ భవనాన్ని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.145కోట్లతో నిర్మించారు. పది అంతస్థులతో, అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ భవనంలో 2లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలం ఉంది. దీనితోపాటు మరో 1.5లక్షల చ.అ. పార్కింగ్‌ సదుపాయం ఉంది. ఐటీ సంస్థల కోసం నిర్మించిన ఈ భవనాన్ని విదేశీ ఐటీ కంపెనీ కాండ్యుయెంట్‌కు నాటి సీఎం చంద్రబాబు కేటాయించారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ కంపెనీలో 1,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఖాళీ చేయించి, అందులో సీఎం క్యాంపు కార్యాలయం పెట్టవచ్చున్నది ప్రభుత్వ అలోచన. దీన్ని మిలీనియం టవర్‌-1గా వ్యవహరిస్తున్నారు.

మిలీనియం టవర్  పక్కనే టవర్‌-2 పేరుతో మరో భవనాన్ని రూ.80 కోట్లతో నిర్మిస్తున్నా రు. దీనిలో ఇంకో లక్ష చదరపు అడుగుల నిర్మాణ స్థలం అందుబాటులోకి వస్తుంది. మిలీనియం టవర్‌కు ముందు అదేవరుసలో నాలుగేళ్ల క్రితం స్టార్టప్‌ విలేజ్‌ కోసం ఒక భవనాన్ని రూ.70 కోట్లతో నిర్మించారు. 50వేల చ.అ. నిర్మాణ స్థలం ఉంది. ఇవన్నీ రుషికొండ ఐటీ పార్కు హిల్‌ నం.3లో ఉన్నాయి.  హిల్‌ నం.2లో పలు ఐటీ కంపెనీలకు స్థలాలు కేటాయించగా, వాటిలో కొన్ని ఇప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదు. అవన్నీ వెనక్కి తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందంటున్నారు. అయితే రుషికొండ ఐటీ సెజ్ లో ఖాళీ భవనాలను ప్రభుత్వం తీసుకోవడం అంతా ఈజీ ప్రాసెస్ గా లేదు.  సెజ్ లోని భూములను గానీ, భవనాలను గానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటే దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉఁటుంది. కేంద్రం సెజ్ ఉన్న ప్రాంతాన్ని డీ నోటిఫై చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకునే వీలుంటుంది. అయితే ఇప్పుడు పరిశీలిస్తున్న ఇన్నోవేషన్ సెంటర్, మిలీనియం టవర్ .. ఈ రెండూ కూడా సెజ్ పరిధిలో లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి చిక్కులు లేకుండా అనుకున్నదే తడువుగా వీటిని అధీనంలోకి తీసుకోని కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. 
 

విశాఖ శివారు భూములు
అంతే కాకుండా విశాఖ శివార్లలోని ప్రభుత్వ భూములు, సమీకరణకు అనువుగా ఉన్న స్థలాలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా భూసమీకరణకు కసరత్తు చేస్తోంది. ఏపీ బిల్డ్‌ కోసం దాదాపు 4 వేల ఎకరాలను గుర్తించి, 164 భూకమతాలను సిద్ధం చేశారు. విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో 385 ఎకరాలు, విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో 1700 ఎకరాలు భూములు ఉన్నాయి. అలాగే, వివిధ సంస్థలకు కేటాయించినా వాటిని వినియోగించని భూములు ఉన్నాయి. సీతంపేట సమీపంలో ఐటీ సంస్థకు కేటాయించిన భూముల్లో కొంత, కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన భూములూ వృథాగా ఉన్నట్టు గుర్తించారు.  మరోవైపు, ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులతో విశాఖ జిల్లా అధికారులు తరచూ సంప్రదిస్తున్నారు. జీఎన్‌రావు కమిటీ నివేదిక తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ వివిధ అంశాలపై కలెక్టర్‌, ఇతర అధికారులతో పలుసార్లు సమీక్షించారు. సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌, సీఎం సలహాదారు శ్యామ్యూల్‌ విశాఖలో ఇప్పటికే పర్యటించారు. పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌, డైరెక్టర్ విజయకుమార్‌విశాఖ నగరంలో పర్యటించి భవనాలు, భూములపై ఆరాతీశారు. మరోవైపు పరిశ్రమల శాఖ, ఐటీ శాఖలకు చెందిన ఓ ఎస్ డి లు మధురవాడ ఐటీ సెజ్ ల ప్రాంతాలను పరిశీలించడమే కాకుండా పూర్తి వివరాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది.
 

రుషికొండ ఐటీ పార్క్ 
రుషికొండ ఐటీ పార్కుకు సమీపంలోనే వీఎంఆర్‌డీఏకు చెందిన 20ఎకరాల స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి బాగా దగ్గర. అక్కడ ఐటీ సిటీ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. అవసరమైతే ఆ భూమిలో కూడా ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలు నిర్మించుకోవచ్చు.  ఇక్కడకు సమీపంలో ఉన్న కాపులుప్పాడ గ్రామంలో యునిటెక్‌ కంపెనీకి కాంగ్రెస్‌ హయాంలో 1,350 ఎకరాలు కేటాయించారు. సదరు కంపెనీ చేతులెత్తేయడంతో దానిని ఆ తరువాత వెనక్కి తీసుకున్నారు. అందులో 450 ఎకరాలను గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసి అదానీ కంపెనీకి 175 ఎకరాలు కేటాయించింది. కొండపైకి రహదారి నిర్మించారు. ఇప్పుడు ఆ భూములన్నీ ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. 

 

కాపులుప్పాడ
ఇక కాపులుప్పాడ… ఇప్పుడు అందరి నోట ఇదే మాట.  కాపులుప్పాడ అంటే  నగర పరిసర ప్రాంత వాసులకు తప్ప జిల్లాలోని ఇతర ప్రాంతాల వారికి అంతగా పరిచయం లేని పేరు.  కానీ ఓ వారం పది రోజులుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాసులు నోళ్లలో నానుతోంది కాపులుప్పాడ.  ఎక్కడ పదిమంది కూర్చున్నచోట ఈ పేరునే తలచుకుంటున్నారు. ఇంతకీ అంత విశేషమేంటంటే  ఈ కాపులుప్పాడ ప్రాంతంలోనే విశాఖను రాజధానిగా సచివాలయం సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసే యోచనలో ఉందట.  రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను ప్రతిపాదన చేయడంతో ఎక్కువ ప్రభుత్వ భూములు కలిగి ఉండటంతో  ఈ ప్రాంతం పేరు హఠాత్తుగా తెర మీదకు వచ్చింది.  ఒక్క సర్వె నెంబర్ 314 లోనే 3148.40 ఎకరాలు ఉండటంతో  దీంతో ఇటు  ప్రభుత్వం, అటు ప్రజల్లో  మధ్య ఎట్రాక్షన్ ఐపోయింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నారన్న ప్రకటనతో అందరిచూపు కాపులుప్పాడపై పడింది.  ఎక్కడ పదిమంది సమావేశమైన కాపులుప్పాడ గురించి మాట్లాడుకునే విధంగా పరిస్థితి మారిపోయింది. 

 

భీమిలి
భీమిలి మండలం లోని వందల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అక్కడ రాజధాని నిర్మిస్తుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.  ఈ మాటలను నిజం చేస్తున్నట్లుగా రెవెన్యూ కార్యాలయంలో అధికారులు వివరాలపై  బిజీ అయిపోయారు.  రాత్రి సమయంలో తహసిల్దార్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది ఈ పనులను గడుపుతున్నారు.  దీనికితోడు  ఈ ప్రాంతం నుంచే రాజ్య పాలన  సాగుతోందని విజయసాయిరెడ్డి  చేసిన ప్రకటనతో మరింత వేడి పుట్టింది.  బీచ్ వ్యూ గెస్ట్ హౌస్ లోనే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.  భీమిలిలో సుందరమైన బంగ్లాలో ఉండే చిట్టివలస జూట్ మిల్ గెస్ట్ హౌస్ పై పలువురు దృష్టి పడింది. మూసివేసిన తరువాత గెస్ట్ హౌస్ మందు బాబులు అడ్డాగా మారింది.  ప్రభుత్వం తలచుకుంటే చేయడం ఎంత సేపు అని పలువురు చర్చించుకుంటున్నారు. కాపులుప్పాడ ప్రాంతానికి సచివాలయ భవనాలు వస్తే తమకు ఉపాది పిల్లులు భవిష్యత్తు బాగుందని స్థానికులు అంటున్నారు.

భీమిలి మండలం పరిధిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయన్నది ప్రభుత్వం చెబుతున్న లెక్క. అక్కడే పోలీస్ గ్రౌండ్స్ కు ఉంది.ఆదాని గ్రూపుకు కేటాయించిన 1344 ఎకరాలు చదను చేసి సిద్దం ఉంది అక్కడ గవర్నర్ బంగ్లాలో పాటు మరికొన్ని కీలక శాఖలు పెట్టెందుకు సిద్దంగా ఉంది..కొండ భాగాన్ని పూర్తిగా తొలచి నిర్మాణానికి అనువుగా మార్చారు..ఈ కొండ తూర్పు భాగంలో బీచ్ రోడ్డు తిమ్మాపురం కొంత భాగం ఉంది… సర్వేనెంబర్ 314 లో పలు సంస్థలకు స్థలం కేటాయించారు..అవి కుడా ప్రభుత్వం వెనక్కి తీసుకోనే అవకాశలు కనిపిస్తున్నాయి…అయితే ఈ ప్రాంతం భూములు విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది.  

నిన్న మొన్నటి వరకు చదరపు గజం 20,000 వరకు ఉండేది  ఇప్పుడు ఒకేసారి పది వేలు పెరిగిపోయింది.కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న రియల్ బ్రోకర్లు ఫోన్లు గ్యాప్  లేకుండా మోగుతున్నాయి సుమారు వంద ఎకరాల్లో వేసిన ఓ ప్రైవేటు చదరపు గజం ప్రస్తుతం 25 వేలకు పైగానే చెబుతుండడంతో కొనుగోలుదారులు అవాక్కవుతున్నారు… ఇక ప్రభుత్వం పూర్తి నిర్ణయం తీసుకుంటే ఇది మరింత పెరిగిపోయే అవకాశం ఉంది 

భీమిలిలో క్యాంప్ ఆఫీసులో ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అనుకూల అంశాలపై ఈ ప్రాంతంలో జోరుగా చర్చ జరుగుతుంది.జ్యూట్ మిల్లు ఖాళీ కావడంతో అక్కడ సీఎం నివాసం ఎర్పాటు చేస్తే బాగుంటుందని ఓ వాదన వినిపిస్తుంది అయితే సెక్యురిటి పరంగా కొన్ని సమస్యలు ఉండటం వల్ల దానిని కుడా పరిశిలిస్తున్నారు…వాల్తేరు క్లబ్ లో కుడా సీఎం నివాస ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని మరో వాదన ఉన్నా… సచివాలయం క్యాంప్ ఆపీసులపై మాత్రం ఓ క్లారిటీతో అధికారులు ఉన్నారు. 

ఆంధ్రా యూనివర్సిటీ భవనాలు
ఒకవైపు ఖాళీ భూములు, ఐటీ సంస్థల ఖాళీ భవనాలు పరిశీలిస్తుండగానే ప్రతిష్టాత్మకమైన ఆంధ్రాయూనివర్శిటీపైనా పాలకులు దృష్టి సారించారు. యూనివర్శిటీకి చెందిన చాలా భూములు నగరంలో ఖాళీగా ఉన్నాయి. అంతేకాదు పలు విభాగాలకు చెందిన భవనాలు పెద్దగా వినియోగంలో లేవు. ఒకవేళ వినియోగంలో ఉన్నా సరే అన్ని విధాలా వసతులు అందుబాటులో ఉంటే ఆలాంటి భవనాలను కూడా అధికార యంత్రాంగం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  ఆంధ్రాయూనివర్శిటీలోని టీఎల్ఎన్ సభా హాల్లో ఆంద్రరాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. అలాగే ఇటీవల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్ లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ తొలి కేబినెట్ సమావేశాన్ని కూడా ఏయూలోనే నిర్వహించింది.  

ఏయూలోని కౌన్సిల్ హాల్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్ తొలి సమావేశాన్ని నిర్వహించారు.  ఉదయం ప్రారంభమైన ఈ కేబినెట్ మీటింగ్ రాత్రి ఏడు గంటల వరకు సుదీర్ఘకాలంపాటు కొనసాగింది. అలాగే హుద్ హుద్ తుపాను వచ్చిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు విశాఖ కలెక్టరేట్ కేంద్రంగానే పరిపాలన చేసారు. సుమారు పది రోజుల పాటు విశాఖ కలెక్టరేట్ ఆవరణలో బస్ లో బస చేసిన చంద్రబాబు అధికారిక కార్యకలాపాలు, పాలనా వ్యవహారాలను విశాఖ కలెక్టరేట్ నుంచి  అప్పట్లో కొనసాగించారు.ఇలా ఆంధ్రాయూనివర్శిటీకి, కలెక్టరేట్ కు కూడా రాజధానిలో జరిగే వ్యవహారాలకు వేదికగా గతంలో నిలిచాయి.

ఇప్పుడు ప్రభుత్వం విశాఖను పాలనా కేంద్రంగా చేసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో  ఆంధ్రా యూనివర్శిటీ లోని భవనాలను కూడా అధికార వర్గాలు, ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు ఆరా తీస్తున్నాయి.  మొత్తానికి అన్నిరంగాలలో అభివృధ్ది చెందుతూ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న  విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేందుకు ప్రభుత్వం  యోచిస్తోంది. దీనికి సంబంధించిన స్థలాలు, మౌలిక సదుపాయాలు  విశాఖలో ఉండటంతో  ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు రావటం ఖాయమని తెలుస్తోంది.