సడెన్‌గా సైలెంట్ అయిన సుదర్శన్ రెడ్డి, అందివచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి రెడీ అయిన ఆ ఇద్దరు

  • Published By: naveen ,Published On : October 6, 2020 / 02:54 PM IST
సడెన్‌గా సైలెంట్ అయిన సుదర్శన్ రెడ్డి, అందివచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి రెడీ అయిన ఆ ఇద్దరు

sudharshan reddy: ఒకప్పుడు బోధన్‌ నియోజకవర్గం అంటే సుదర్శన్‌ రెడ్డి పేరే గుర్తొచ్చేది. మరిప్పుడో.. ఆయన రెండుసార్లు ఓడిపోవడంతో ఒక్కసారిగా ఫేడ్‌ అవుట్‌ అయిపోయారు. ఓటములను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట. మంత్రిగా వ్యవహరించిన సుదర్శన్‌ రెడ్డి సైలెంట్‌ అయిపోవడంతో చాన్స్‌ దొరికింది కదా అని ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పుడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, బీజేపీ నుంచి చేరిన కరుణాకర్ రెడ్డి అదే పనిలో పడ్డారట. ఇద్దరిలో ఒకరికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో సుదర్శన్‌రెడ్డి పోటీ చేస్తారా?
చివరి క్షణంలో మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబు ఖాన్ కుమారుడు … సల్మాన్ బాబు ఖాన్ సైతం రంగంలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదనే టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అయిష్టంగానే రంగంలోకి దిగారు. రాబోయే ఎన్నికల్లోనూ పోటీ చేస్తారా? లేదా అన్నది తెలియడం లేదంటున్నారు.

రాజకీయాలకు విరామం ప్రకటించేందుకే ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే మరో వాదన వినిపిస్తోంది. ఆయనకు ఇప్పటికీ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. క్యాడర్ బలంగా ఉంది. కానీ ఆయన నియోజకవర్గంలో అంతగా పర్యటించకపోవడానికి కారణం ఏంటన్నది జవాబు దొరకని ప్రశ్నగా మారింది.

రెండు సార్లు ఓటమితో తీవ్ర ఆవేదన:
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజవకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి గెలిచిన సుదర్శన్ రెడ్డి వైద్యశాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా రాష్ట్రానికి సేవలందించారు. హస్తం పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు.

రాజకీయాల్లో హుందాగా ఉండే ఆయన.. బోధన్ నియోజకవర్గం నుంచి తన ప్రత్యర్ధి షకీల్ చేతిలో రెండు సార్లు ఓటమి పాలయ్యారు. బోధన్‌లో కాంగ్రెస్ బలంగా ఉన్నా కొన్ని సమీకరణాల కారణంగా ఆయన ఓడిపోయారు. దీంతో సుదర్శన్‌రెడ్డి ఒకింత ఆవేదనకు లోనయ్యారట. అప్పటి నుంచి ఎక్కువ శాతం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులకు, నియోజకవర్గానికి తక్కువ సమయం కేటాయిస్తున్నారు.

నియోజకవర్గ ప్రజలకు అంటీముట్టనట్టుగా ఉంటున్న సుదర్శన్‌రెడ్డి:
ఇదే అదనుగా భావించిన బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి మెజార్టీ నేతలను కారెక్కించేశారు. హస్తం వీడుతున్న నేతలకు భరోసా ఇవ్వడంలో సుదర్శన్ రెడ్డి చొరవ చూపించడం లేదని అంటున్నారు. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ నియోజవర్గ ప్రజలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారట.

ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఆయన అసలు కనిపించ లేదని కార్యకర్తలు అంటున్నారు. కార్యకర్తలకు సైతం అందుబాటులో ఉండటం లేదట. దీంతో ఆయన రాజకీయాలకు దూరం అవుతారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ నాయకత్వ బాధ్యతల కోసం పావులు కదపడం మొదలు పెట్టారంటున్నారు. మరి సుదర్శన్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?