ఆసక్తి రేపుతున్న సూళ్లూరుపేట రాజకీయాలు  

రాజకీయ చైతన్యం కలిగిన నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది.

  • Published By: veegamteam ,Published On : January 19, 2019 / 01:58 PM IST
ఆసక్తి రేపుతున్న సూళ్లూరుపేట రాజకీయాలు  

రాజకీయ చైతన్యం కలిగిన నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది.

నెల్లూరు : జిల్లాలోని సూళ్లూరుపేట రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. వైసీపీ ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేస్తే…టీడీపీని నేతల మధ్య విభేదాలు వెంటాడుతున్నాయి. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని తగదాలు పక్కన పెట్టి పని చేయాలని హెచ్చరించినా.. నేతల్లో మార్పు కనపడడం లేదు. దీన్నే వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని పావులు కదుపుతోంది.

రాజకీయ చైతన్యం కలిగిన నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. విలక్షణమైన ఈ అసెంబ్లీ స్థానంలో….రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతుంటాయి. టీడీపీకి కంచుకోటయిన సూళ్లూరుపేటలో…గత ఎన్నికల్లో వైసీపీ తరపున కిలివేటి సాంబయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో….అధికార, విపక్షాలు వ్యూహాల్లో మునిగిపోయాయి. అధికార టీడీపీకి నేతల మధ్య గొడవలు….కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న పరసారత్నం, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, వ్యాపారవేత్త గంగాప్రసాద్, వేనాటి రామచంద్రారెడ్డి, వాకాటి నారాయణరెడ్డిలు…ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నేతల వ్యవహారశైలి అధినేతకు తలనొప్పి తెప్పిస్తున్నాయి. 

సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీకి…వేనాటి కుటుంబం అండగా ఉంటూ వస్తోంది. దివంగత నేత మునిరెడ్డి టీడీపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, సమితి ప్రెసిడెంట్‌గా, డీసీసీ బ్యాంక్ ఛైర్మన్‌గా, రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఆయన వారసుడిగా తెరపైకి వచ్చిన రామచంద్రారెడ్డి….చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్ ఛైర్మన్‌గా నాలుగుసార్లు పని చేశారు. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ…కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. రామచంద్రారెడ్డి, పరసారత్నంకు అసలు పడటం లేదు. జడ్పీ ఛైర్మన్‌ రాఘవేంద్రరెడ్డిని పార్టీలోకి తీసుకురావడంపై వేనాటి ఆలకబూనారు. సీఎం పర్యటనకు తప్ప ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. 

ఎమ్మెల్సీగా ఉన్న వాకాటి నారాయణరెడ్డి వర్గం…టీడీపీపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకులకు నగదు ఎగవేత కేసులో జైల్లో ఉన్న వాకాటిని….జిల్లా టీడపీ నేతలు పరామర్శించకపోవడం, నాయకత్వం అండగా నిలబడకపోవడం వంటి అంశాలతో వాకాటి సీరియస్‌గా ఉన్నారు. ఇదే అదనుగా భావించిన వైసీపీ…వాకాటి నారాయణరెడ్డి వర్గానికి తమ గూటికి చేర్చుకునేందుకు రంగం చేస్తున్నట్లు సమాచారం. అటు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం టీడీపీలో చేరినప్పటికీ….సైలెంట్‌గా ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం, పరసారత్నం మధ్య సఖ్యత కుదరడం లేదు. పైకి ఇద్దరూ అన్నదమ్ముల్లా కనిపిస్తుప్పటికీ…లోపల మాత్రం కత్తులు నూరుతున్నట్లు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరోవైపు వ్యాపారవేత్త గంగాప్రసాద్‌ కూడా…ప్రతి ఎన్నికల్లో ఈ ప్రాంతంలో హవా చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కూడా అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో వియ్యమందుకున్న తర్వాత…గంగాప్రసాద్‌ వెంకటగిరిపై దృష్టి పెట్టారు. దీంతో ఆయన వర్గీయులు ఎవరి వెంట వెళ్లాలో అర్థం కాని స్థితిలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరసారత్నంపై నియోజకవర్గంలో పలువురు నేతలు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన పరసారత్నం…వేనాటితో సన్నిహితంగా ఉండేవారు. క్రమంగా తనకంటూ వర్గాన్ని తయారు చేసుకున్న తర్వాత…పార్టీ జెండా మోస్తున్న వారిని పట్టించుకోవడం లేదంటూ ఎంపీపీలు, జడ్పీటీసీలు పరసారత్నంపై విమర్శలు చేస్తున్నారు. 2014లో వైసీపీ తరపున గెలుపొందిన కిలివేటి సంజీవయ్యకు…క్షేత్రస్థాయిలో కేడర్‌ ఉండటంతో పాటు రెండు మున్సిపాల్టీల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర సందర్భంగా సంజీవయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు జగన్. దీనికి తోడు టీడీపీ నేతల మధ్య విభేదాలు తనకు కలిసి వస్తాయని భావిస్తున్న సంజీవయ్య….ఆ పార్టీ క్యాడర్‌ను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీలో అసంతృప్తితో ఉన్న నేతలందర్ని జగన్‌ బస్సు యాత్ర సందర్భంగా పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీలో నేతల మధ్య విభేదాలను పరిష్కరించి….సమన్వయంతో పని చేసేలా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణలు పర్యటనలు చేస్తున్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో పులికాట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లు వేయడం, హౌస్ ఫర్ ఆల్ వంటి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న పాశం సునీల్‌ను సూళ్లూరుపేట నుంచి బరిలోకి దించాలని టీడీపీ నేతలు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియజేసేందుకు రెడీ అయినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల వేళయినా టీడీపీ నేతల కలిసి కట్టుగా పని చేస్తే…ఆ పార్టీ విజయం సులువవుతుంది. లేదంటే మరోసారి వైసీపీ జెండా ఎగురవేస్తుందని నియోజయవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు.