సండే..తెలంగాణ కేబినెట్ భేటీ : తీపి కబుర్లు ఉంటాయా

  • Published By: madhu ,Published On : February 15, 2020 / 07:19 PM IST
సండే..తెలంగాణ కేబినెట్ భేటీ : తీపి కబుర్లు ఉంటాయా

రెవెన్యూ చట్టంలో ప్రక్షాళన ఖాయమేనా..? సచివాలయ నమూనాలను ఫైనల్ చేస్తారా..? అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఎప్పుడు జరుగనున్నాయి..? రుణమాఫీ, ఆసరా పెన్షన్లపై తీపి కబురు అందేనా..? ఇన్ని సందేహాల మధ్య జరిగే తెలంగాణ కేబినెట్‌ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

2020, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. దాదాపు ఏడాది కాలంగా కొత్త చట్టంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో రెవెన్యూ చట్టం అమలు చేస్తామని సిఎం కేసిఆర్ గతంలోనే వెల్లడించారు. దీంతో కొత్త చట్టంపై జోరుగా చర్చ నడుస్తోంది. 

కొత్తగా నిర్మించనున్న సచివాలయ నిర్మాణం ప్లాన్‌ను కేబినెట్‌ ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. పట్టణ ప్రగతి కార్యక్రమంపై మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం పంచాయతీరాజ్, మున్సిపల్ సమ్మెళనాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో  పట్టణ ప్రగతిని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునేందుకు అనుసరించాల్సిన విధానాలను సిఎం కేసిఆర్ మంత్రులకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.

అలాగే అసెంబ్లీ సమావేశాల తేదీ, బడ్జెట్ పైనా చర్చించే చాన్స్ కనిపిస్తోంది. ఆర్ధిక మాంధ్యం, కేంద్రం నుంచి నిధుల మంజూరులో జరుగుతున్న అలసత్వంపై శాఖల వారిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేసే అవకాశముంది. రైతు బంధు పథకానికి సీలింగ్ విధించే అంశంపై కూడా చర్చ జరుగనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా అదనపు టిఎంసి నీటిని ఎత్తిపోసే పథకానికి కెబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందని తెలుస్తోంది. 

2018 ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన హామీలు రైతు రుణమాఫీ, అసరా లబ్దిదారులకు వయో పరిమితి తగ్గింపు, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు, పీఆర్సీ తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. అంతేకాకుండా రుణమాఫీ, అసరా పెన్షనర్లకు తీపి కబురు అందుతుందని సమాచారం.