ఏపీలో ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు, కోడ్ ఎత్తేయాలని ఆదేశం

  • Published By: veegamteam ,Published On : March 18, 2020 / 06:46 AM IST
ఏపీలో ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు, కోడ్ ఎత్తేయాలని ఆదేశం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 6 వారాల పాటు ఎన్నికలు వాయిదా వేస్తూ ఏపీ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఎన్నికల నిర్వహణలో ఈసీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పింది. ఎన్నికల వాయిదాపై జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే విషయంలో తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదే అని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డుకాకూడదు:
అదే సమయంలో తక్షణం ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల కోడ్ ని ఎత్తివేయాలని కోర్టు సూచించింది. కోడ్ ఎత్తివేయాలనే ఆదేశంతో ప్రభుత్వం చేపట్టాలనుకున్న భూపంపిణీకి అడ్డంకి తొలిగినట్టు అయ్యింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే మాత్రం ఈసీ అనుమతి తప్పనిసరని కోర్టు తేల్చి చెప్పింది.

జగన్ ప్రభుత్వానికి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్:
కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది. రాజకీయ రగడకు దారి తీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన జగన్ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది. సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పకుండానే ఎన్నికల కమిషనర్ ఎన్నికలు వాయిదా వేశారని వాదనలు వినిపించింది. కరోనా వైరస్ కట్టడికి స్థానిక ప్రజాప్రతినిధులు అవసరం చాలా ఉందని కోర్టుకి విన్నవించింది. యథావిథిగా ఎన్నికలు నిర్వహించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరింది.

ఉగాదికి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్:
కాగా, ఏపీలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకే ఎన్నికలు వాయిదా వేశామని ఈసీ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈసీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పింది. దీంతో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. అదే సమయంలో తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం జగన్ ప్రభుత్వానికి కొంత ఊరటనిచ్చినట్టు అయ్యింది. ఉగాదికి 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డంకులు తొలిగాయి.

See Also | స్థానిక ఎన్నికలు జరిగితే ఏపీలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు