బీసీ ఓట్లకు గాలం: రాజమహేంద్రవరం లో టీడీపీ సభ

  • Published By: chvmurthy ,Published On : January 26, 2019 / 04:15 PM IST
బీసీ ఓట్లకు గాలం: రాజమహేంద్రవరం లో టీడీపీ సభ

పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలలో తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకొనేందుకు తెలుగుదేశం భారీ బహిరంగ సభకు సిద్ధమైంది.  ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజమహేంద్రవరం వేదికగా “జయహో బీసీ” పేరిట ఆదివారం నిర్వహించే ఈసభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బీసీ నాయకులు హాజరయ్యేలా వ్యూహ రచన చేశారు. తెలుగుదేశం హయాంలోనే బీసీలకు మేలు జరిగిందనే విషయాన్ని ఈవేదిక ద్వారా చాటడంతోపాటు టీఆర్ ఎస్, వైసీపీ  కలిసి బీసీల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయని ప్రజల్లోకి తీసుకవెళ్లాలని పార్టీ భావిస్తోంది.
ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల్లో బీసీలలో తమకున్న పట్టును నిలుపుకోగలిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సులభతరమని తెలుగుదేశం అంచనా వేస్తోంది. అందుకే గత ఐదేళ్లలో బీసీలకు ఇచ్చిన ప్రయోజనాలను గుర్తు చేస్తూ భవిష్యత్తు హామీలపై స్పష్టత ఇచ్చేలా జయహో బీసీ సభను నిర్వహిస్తున్నారు. బీసీల అభ్యున్నతికి గడచిన ఐదేళ్లలో 20వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎన్నడూ లేని విధంగా ఇంత వరకు ఏప్రభుత్వం చేయని విధంగా తాము ఈప్రయోజనం చేకూర్చామని ఘనంగా చాటుకుంటోంది. గతంతో పోల్చితే ఈఐదేళ్లలోనే 300 శాతం అధిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కేటాయించింది. 
2004 నుంచి రాష్ట్ర విభజన జరిగిన  2014 వరకు  రూ.7,815.05 కోట్ల రూపాయలు బలహీన వర్గాల కోసం గత ప్రభుత్వాలు ఖర్చు చేశాయి. విభజన అనంతరం అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు రూ. 22,704.44 కోట్లు బీసీలకు కేటాయించారు. ఇందులో 90 శాతంపైగా నిధులను సద్వినియోగం చేసుకొని వెనుకబడిన వర్గాల లబ్ధిదారులు అన్ని విధాలా  ప్రభుత్వం అండగా నిలిచింది. 
విద్య విషయంలోనూ ఏపీలో  బీసీలకు ప్రభుత్వం పూర్తి అండగా నిలిచింది. గత నాలుగున్నరేళ్లలో రూ.36.66లక్షల బీసీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు అందజేశారు. రూ.3.16లక్షల కాపు విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు  అందచేసారు. బీసీలకూ సాంస్కృతిక, సామాజిక మేళవింపు ఉండాలన్న సదుద్దేశంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బీసీ భవనాలను నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.5 కోట్లు బడ్జెట్ కేటాయించారు. చంద్రన్న పెళ్లి కానుక కింద ఒక్కో నూతన వధువుకు 35 వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఈమేర వందకోట్లు బడ్జెట్లో కేటాయించారు. 2.91 లక్షల మందికి కార్పొరేషన్ల ద్వారా రూ.1967 కోట్లు….బలహీన వర్గాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడం కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు 1735కోట్ల రూపాయలను వెచ్చించింది. దీని వల్ల మొత్తం 2,91,324 మంది లబ్ధిపొందారు. 
వెనుకబడిన తరగతుల్లోని అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశకత్వంలో అధికారులు 11 ఫెడరేషన్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 96,333 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.432.72 కోట్లను అందజేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో అత్యధికంగా 8 మంది బీసీలకు చోటు కల్పించడంతోపాటు నామినేటెడ్‌ పదవుల భర్తీలో కూడా అధిక ప్రాధాన్యం కల్పించామని టీడీపీ చెప్తోంది. వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో 113మంది బీసీలను సభ్యులుగా నియమించడంతోపాటు 9 విశ్వవిద్యాలయాలకు వైస్‌ఛాన్సలర్లుగానూ కీలక బాధ్యతలు కట్టబెట్టామని లెక్కలు వివరిస్తోంది. ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం పదవి బీసీకి ఇచ్చిన విషయాన్ని రాజమహేంద్రవరం వేదిక 
ద్వారా ముఖ్యమంత్రి వివరించనున్నారు. 
ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశమేనని నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇదే సమయంలో రానున్న రోజుల్లో బీసీలకు కల్పించే ప్రయోజనాలను అధినేత చంద్రబాబు ఈ సభలో ప్రకటిస్తారు. రాజమహేంద్రవరం సభలో బీసీల కార్యాచరణ ప్రకటించేందుకు ఇప్పటికే పార్టీలోని ముఖ్యమైన బీసీ నేతలు, ఫెడరేషన్‌ ఛైర్మన్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అమరావతిలో వర్క్‌షాప్‌ నిర్వహించి అందులో వచ్చిన సిఫార్సుల  ఆధారంగా ఓ నివేదికను రూపొందించారు. అధినేత చంద్రబాబు కూడా దీనిపై ఇప్పటికే కసరత్తు చేసి జయహోబీసీసభలో ప్రకటించనున్నారు.