టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం

రైతు, యువత, మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది.

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 02:45 AM IST
టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం

రైతు, యువత, మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది.

రైతు, యువత, మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది. 60 ఏళ్లకే వృద్దాప్య ఫించను, మహిళలకు 55 ఏళ్లకే ఫెన్షన్‌లాంటి జనాకర్షక పథకాలతో మేనిఫెస్టోను తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ఫించన్‌ మూడు వేల రూపాయలకు పెంచడంతోపాటు.. 300 గజాల్లో ఇళ్లు, గృహ రుణాల మాఫీ, చంద్రన్న పెళ్లికానుక లక్ష రూపాయలకు పెంపులాంటి అంశాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. టీడీపీ మేనిఫెస్టోను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. 
Read Also : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో

ఎన్నికల మేనిఫెస్టో అంటేనే.. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవాలి. జనాకర్షక పథకాలు, హామీలు  అందులో ఉండాలి. అప్పుడే ఆ పార్టీకి ప్రజలు ఓటు వేయడానికి మేనిఫెస్టో ఉపయోగ పడుతుంది. అధికారంలో ఉన్న పార్టీ మేనిఫెస్టోను రూపొందించడం సవాల్‌ లాంటిదనే చెప్పాలి.  అంతటి ప్రాధాన్యమున్న మేనిఫెస్టోను టీడీపీ మొత్తానికి సిద్ధం చేసింది. రైతు, మహిళ, యువత, విద్యార్థి ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను తయారు చేసినట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
 
చంద్రన్న బీమా పథకాన్ని 5 నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ మేనిఫెస్టో తయారు చేసినట్టు తెలుస్తోంది. నిరుద్యోగ భృతి మూడువేలతోపాటు ఇంటర్మీడియట్‌ పాసే ఇందుకు అర్హత పరిగణించనున్నారు.  ఇక ఎన్టీఆర్ వైద్యసేవకు ప్రస్తుతం రెండున్నర లక్షలు ఉండగా… దానిని ఐదు లక్షలకు పెంచే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మాదిగ, ఎస్టీ కార్పొరేషన్‌తోపాటు… మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవిలాంటి హామీలను చేర్చినట్టు సమాచారం.  కొత్త జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారంతోపాటు అన్నదాత సుఖీభవ కొనసాగింపులాంటి అంశాలు మేనిఫోస్టోలో ఉండనున్నాయి. సీపీఎస్‌ రద్దుకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే ఐదు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తోంది. ఈ మేనిఫెస్టోలో ఈ పథకాల కొనసాగింపుతోపాటు కొత్త పథకాలకూ రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ మేనిఫెస్టోలో అభివృద్ధితోపాటు సంక్షేమ రంగానికి పెద్దపీట వేయనున్నారు. పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఈసారి టీడీపీ మేనిఫెస్టోను రూపొందించారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై అనేక ప్రతిపాదనలు పరిశీలించి రూపొందించింది. చంద్రన్న పెళ్లికానుక పథకం లబ్దిదారులకు సంబందిత చెక్‌తోపాటు .. ఆ జంటకు ఇంటి స్థలం లేదా ఇల్లు మంజూరు పత్రాలు , గ్యాస్‌ కనెక్షన్‌ పెళ్లిపీటల మీదే అందజేసే పథకాన్ని మేనిఫెస్టోలో చేర్చారు. 

రంగాల వారీగా అనేక ప్రతిపాదనలను యనమల కమిటీ సిద్ధం చేసింది. అధినేత చంద్రబాబు ఇప్పటికే మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దారు. ఈ ఉదయమే అమరావతిలోని ప్రజావేదికపై మేనిఫెస్టోను లాంఛనంగా ఆయన ఆవిష్కరించనున్నారు. రైతులకు 9 గంటలపాటు ఉచితంగా అందించే విద్యుత్‌ను 12 గంటలకు పెంచే యోచనలో టీడీపీ ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చినట్టు తెలుస్తోంది.2023తో ముగియనున్న ఎస్సీ ఉప ప్రణాళిక కాలపరిమితిని మరో 10 ఏళ్లు పొడిగించే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చారు.  కుటుంబ వికాసం కోసం 15 అంశాలు, సమాజ వికాసం కోసం మరో 10 అంశాలు చేర్చినట్టు సమచారం. 
 
యువజనాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ను మంత్రి నారా లోకేష్‌ నేతృత్వంలో పనిచేస్తోన్న కమిటీ రూపొందించింది. ఇందులో భాగంగా నూతన యువజన విధానాన్ని తీసుకురానున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేంత వరకు అన్నదాత – సుఖీభవ పథకం  మరింత సమర్ధంగా అమలు చేసేందుకు కార్యాచరణను మేనిఫెస్టోలో చేర్చారు.  గిరిజనులను వ్యవసాయంవైపు ఆకర్షించేందుకు ఏం చేయాలన్న అంశాలను మేనిఫెస్టోలో చేర్చినట్టు తెలుస్తోంది.

బీసీ యువతకు రాయితీపై వాహనాలు,  ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్‌ స్కూల్‌, దళితతేజం, నారా హమారా సభల్లో ఇచ్చిన హామీలు, చెరువుల పునరుద్ధరణ, ఐదు నదుల అనుసంధానంతో మహాసంగమం లాంటి అంశాలను మేనిఫెస్టోలో టీడీపీ చేర్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ  అదే సమయంలో ఆర్ధిక సమీకరణాలు బేరీజు వేసుకుంటూ ప్రజాకర్ష మేనిఫెస్టోను అధినేత చంద్రబాబు ఇవాళ ఆవిష్కరించనున్నారు.
Read Also : టీడీపీకి గుడ్‌బై చెప్పేస్తున్న మండవ వెంకటేశ్వరరావు