చెప్పాల్సింది చెప్పాం : బంతి వంశీ కోర్టులో : ఎంపీ కేశినేని

  • Publish Date - October 31, 2019 / 08:35 AM IST

ఏపీ టీడీపీలో వల్లభనేని వంశీ రాజీనామా కాకా పుట్టిస్తోంది. ఆయన్ను బుజ్జగించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బాబు సూచనల మేరకు ఎంపీ కేశినేని నాని, కొనకళ్ల నారాయణ జరిపిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. పార్టీలో కొనసాగలేనని వంశీ క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీలో చేరబోతున్నట్లు తేల్చిచెప్పేసినట్లు సమాచారం. వంశీకి చెప్పాల్సిందంతా చెప్పినట్లు 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం మీడియాకు తెలియచేశారు కేశినేని నాని.

ఇప్పుడు నిర్ణయం ప్రకటించాల్సింది వంశీనేనంటూ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఒత్తిళ్లు సహజమని, వీరోచితంగా పోరాడి..ఇప్పుడు వెన్నుచూపడం మంచిది కాదని సూచించారు. పారిపోవడం మొదలు పెడితే..జీవితాంతం పారిపోవాల్సిందేనన్నారు. వంశీకి టీడీపీ ఎంత అవసరమో..పార్టీకి వంశీ అంతే అవసరమన్నారు. ఆయన ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు కేశినేని.

గత వారం రోజులుగా వంశీ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడినట్లైందని భావిస్తున్నారు. మొదట బీజేపీ నేతలను తర్వాత వైసీపీ నేతలను వంశీ కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం ఎమ్మెల్యే పదవికి, టీడీపీ పార్టీ సభ్యత్వానికి వంశీ రాజీనామా చేయడంతో గన్నవరం టీడీపీ శ్రేణుల్లో అనిశ్చితి నెలకొంది. అంతేగాకుండా..రాజకీయాలకు కూడా గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు వంశీ. అయితే..ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనేది హాట్ టాపిక్ అయ్యింది.

అధినేత బాబు, వంశీ మధ్య ప్రత్యుత్తరాలు నడిచాయి. కానీ..రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన వంశీ..వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపతున్నట్లు టాక్. నవంబర్ 03వ తేదీన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరి ఆయన ఏ పార్టీలో చేరుతారు ? లేక రాజకీయాలకు నిజంగానే దూరంగా ఉంటారా ? అనేది రానున్న రోజుల్లో తేలనుంది. 
Read More : చర్చలు విఫలం : టీడీపీలో కొనసాగలేనని స్పష్టం చేసిన వంశీ

ట్రెండింగ్ వార్తలు