స్పీకర్ తమ్మినేనికి నారా లోకేష్ లేఖ

  • Published By: chvmurthy ,Published On : November 8, 2019 / 02:43 PM IST
స్పీకర్ తమ్మినేనికి నారా లోకేష్ లేఖ

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల మాజీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఖండించారు. అగ్రిగోల్డ్ విషయంలో తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.  అవాస్తవమైతే మీరేం చేస్తారో చెప్పాలని ఆలేఖలో కోరారు.  ఈ మేరకు ఆయన శుక్రవారం స్పీకర్ కు ఒక లేఖ రాశారు. 

“మీ విద్యార్హ‌త‌లు, రాజ‌కీయానుభ‌వం స్పీక‌ర్ ప‌ద‌వికే వ‌న్నె తెస్తాయని ఆశించాను. స‌భాప‌తిగా ప్ర‌తిప‌క్ష‌నేత‌ గురించి ‘గుడ్డలూడ‌దీయిస్తా’ అంటూ మీరు చేసిన వ్యాఖ్య‌లు మీ స్పీక‌ర్ స్థానాన్ని తగ్గిస్తున్నాయి..మీరు చేసిన ఆరోప‌ణ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటాను అంటే నాదొక స‌వాల్ అని అన్నారు. అగ్రిగోల్డ్‌కి  నాకు సంబంధం ఉంద‌ని నిరూపిస్తే నా ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాను అని లోకేష్ సవాల్ విసిరారు. ఆరోప‌ణ‌లు అన్నీ అవాస్త‌వాల‌ని తేలితే..మీరేం చేస్తారో కూడా చెప్పాల‌ని ఈ బ‌హిరంగ లేఖ ద్వారా స‌వాల్ విసురుతున్నాను. ‘నేనొక ప్ర‌జాప్ర‌తినిధిగా మాట్లాడుతున్నా’నంటూ  మీరు స‌మ‌ర్థించుకోవ‌డం హర్షణీయం కాదని స్పీకర్ కు హితవు పలికారు.

వైఎస్ హ‌యాంలో అగ్రిగోల్డ్ మోసాలు వెలుగుచూశాయి. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో డిపాజిట్‌దారుల వివ‌రాలు సేక‌రించాం. న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించి అగ్రిగోల్డ్ ఆస్తుల‌ను కాపాడాం అని లోకేష్ ఆ లేఖలో వివరించారు. అగ్రిగోల్డ్‌తో నాకు సంబంధం ఉంద‌ని కూడా మీరు వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వంలో ఉన్న‌ది మీరే క‌దా…అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా నాపై చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారని లోకేష్ ప్రశ్నించారు. మీ ఆరోపణలు అవాస్తవమని తేలితే, మీరన్నట్టే ఒక ప్రజా ప్రతినిధిగా మీ పార్టీ అధ్యక్షుడి గుడ్డలూడదీసి, రాజకీయాల నుండి తప్పించేలా సవాల్ స్వీకరిస్తారని ఆశిస్తున్నానని లేఖ ముగించారు.