గుంటూరులో టీడీపీ లేకుండా చేస్తా : వైసీపీలో చేరి మోదుగుల సవాల్

గుంటూరులో టీడీపీ లేకుండా చేస్తా : వైసీపీలో చేరి మోదుగుల సవాల్

గుంటూరులో టీడీపీకి స్థానం లేకుండా చేస్తానని మాజీ ఎంపీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మోదుగుల.. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మోదుగులకు కండువా కప్పిన జగన్.. ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 
Read Also : ఎలక్షన్ ఫీవర్ : జగన్ పార్టీలో చేరిన దాడి వీరభద్రరావు

టీడీపీపై వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదంటూనే తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీలో తనకు న్యాయం జరగలేదని మోదుగుల ఆరోపించారు. ద్వితీయ శ్రేణి పౌరుడిగా ఉండలేక టీడీపీకి రాజీనామా చేశానని చెప్పారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని మోదుగుల తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ కచ్చితంగా గెలుస్తారని మోదుగుల ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ను సీఎం చేసేందుకు సైనికుడిలా పని చేస్తామని మోదుగుల అన్నారు.

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌పై మోదుగుల తీవ్ర విమర్శలు చేశారు. గల్లా జయదేవ్ గుంటూరుకు గెస్ట్ లాంటివారు అని మండిపడ్డారు. జయదేవ్ గుంటూరుకు రావడం, పోవడం తప్పితే ఎంపీగా ఆయన ఎన్నడూ వ్యవహరించ లేదన్నారు. బ్యాలెట్ ద్వారా జయదేవ్‌కు సమాధానం చెబుతానని సవాల్ చేశారు. జగన్ ఆదేశిస్తే ఎన్నికల్లో జయదేవ్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. నా సేవలు ఎలా వాడుకుంటారో జగన్ డిసైడ్ చేస్తారని మోదుగుల చెప్పారు.
Read Also : చంద్రబాబు షాక్ : డేటా కేసులో కీలక సాక్ష్యం నా దగ్గర ఉంది