అచ్చెన్నాయుడ్ని కాపాడేందుకు టీడీపీ బీసీ కార్డ్ 

  • Published By: chvmurthy ,Published On : February 22, 2020 / 02:43 AM IST
అచ్చెన్నాయుడ్ని కాపాడేందుకు టీడీపీ బీసీ కార్డ్ 

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు పేరు ప్రచారంలోకి రావడంపై టీడీపీ సీరియస్‌గా ఉంది. బలహీనవర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందునే టీడీపీకి చెందిన బీసీ నేతలను టార్గెట్‌ చేసిందని మండిపడుతోంది. టీడీపీ వ్యూహాత్మకంగా బీసీ కార్డును తెరపైకి తీసుకొస్తోంది. బీసీలకు అండగా నిలుస్తూ వారి మనసులు గెల్చుకోవాలని వ్యూహాలు రూపొందిస్తోంది. 

పార్టీలోని బలహీన వర్గాల నాయకులపై జరిగే రాజకీయ దాడిని తిప్పి కొట్టేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రధానంగా అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖలో ఈఎస్ఐ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్ నివేదికను కూడా సిధ్ధం చేసింది. ఈ విషయంలో అచ్చెన్నాయుడికి పార్టీ పూర్తి బాసటగా నిలవాలని నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి కూడా బీసీలే వెన్నెముక. అయితే గత ఎన్నికల్లో ఆ వర్గాల్లో చీలిక వచ్చింది. టీడీపీ ఇప్పుడు బీసీ వర్గాలపై దృష్టి సారించింది. 

వైసీపీ పాలనపై టీడీపీకి చెందిన అచ్చెన్నాయుడు సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయడంలేదంటూ బహిరంగ సవాళ్లు విసిరారు. అనేక వేదికలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వైఖరిని ఎండ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడిని ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడిని సైతం వైసీపీ టార్గెట్‌ చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. యనమల టార్గెట్‌గా వైసీపీ నేతలు ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను సైతం రెచ్చగొట్టి.. యనమలపై విమర్శలు చేయిస్తున్నారన్నారు.  కేఈ కృష్ణమూర్తి కుటుంబాన్ని సైతం వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌ చేసినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్‌ ఇంటిపై నకిలీమద్యం పేరుతో పోలీసులు చేయడంపై వారు మండిపడుతున్నారు.

బలహీన వర్గాల నాయకులే టార్గెట్‌గా వైసీపీ చేస్తోన్న వేధింపులు ఆపకపోతే తామంతా రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాల్సి వస్తుందని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.  టీడీపీలోని బీసీ నాయకులను ప్రభుత్వం టార్గెట్‌ చేస్తే చూస్తూ ఊరుకోబోమని , వారి అండగా నిలుస్తామని అంటున్నారు. బలహీన వర్గాల నాయకులకు అండగా నిలబడటం ద్వారా బీసీల మనసులను గెల్చుకోవాలనే టీడీపీ ఆలోచన ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.