తెలంగాణ అసెంబ్లీ: CAA, NPRలపై సభలో తీర్మానం!

  • Published By: madhu ,Published On : March 6, 2020 / 12:36 AM IST
తెలంగాణ అసెంబ్లీ: CAA, NPRలపై సభలో తీర్మానం!

గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం పై విపక్ష పార్టీలు అధికార పక్షాన్ని నిలదీసేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి. టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.

ఆర్థిక మాంద్యం ప్రభావంతో గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయలేక పోయిందని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు. దీనికి తోడు కేంద్రం కూడా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల్లో ప్రధానంగా రైతు రుణమాఫీ, రైతుబంధు, నిరుద్యోగ భృతి లాంటి అంశాలు శాసనసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. 

ఇక టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. రైతులకు అమలు చేసిన పథకాలను సభలోనే వెల్లడించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక పాలమూరు -రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్ని పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సాగునీరు, వ్యవసాయరంగానికి బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యతగా భావించి నిధులు కేటాయించాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇక CAA, NPRలకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేసే అవకాశం ఉంది. 

మరోవైపు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కోంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కంది రైతులు గత కోన్ని రోజులుగా రోడ్డేక్కి అందోళన చేస్తున్నా పట్టించుకోవట్లేదని విమర్శిస్తోంది. అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని వాటన్నింటి పై ఈ బడ్జెట్ సెషన్స్ లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. 

బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకొని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయనుంది. అయితే ప్రతిపక్షాల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు అటు అధికార పార్టీ అశ్ర్రాలను సిద్ధం చేసుకుంటోంది. సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ దాఖలైన అన్నీ పిటీషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.

విభజన చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని.. కూల్చివేయడానికి ప్రభుత్వానికి అనుమతి లేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వ పాలసీ విధానాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను కోర్టు 2020, మార్చి 06వ తేదీ శుక్రవారానికి వాయిదా వేసింది.

Read More : తెలంగాణ అసెంబ్లీ అధ్యక్షా : బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీష్ రావు