తెలంగాణ బడ్జెట్ 1.6 లక్షల కోట్లు

  • Published By: madhu ,Published On : March 6, 2020 / 12:30 AM IST
తెలంగాణ బడ్జెట్ 1.6 లక్షల కోట్లు

శాసనసభలో సవాల్‌ అంటున్నాయి తెలంగాణ అధికార, ప్రతిపక్ష పార్టీలు. బడ్జెట్ సమావేశాలు 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం నుంచి మొదలవుతుండడంతో.. వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. సీఏఏ, ఎన్‌పీఆర్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశముంది. అటు.. రైతు సమస్యలే ఎజెండాగా ప్రభుత్వంపై విపక్షాలు దాడికి సిద్ధమవుతున్నాయి. గవర్నర్ ప్రసంగంతో  తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరుగనుంది. ఆదివారం ఆర్ధిక మంత్రి హరీష్‌ రావు శాసనసభలో బడ్జెట్ ను  ప్రవేశ పెట్టనున్నారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ఆశించిన స్థాయిలో రాష్ట్రానికి రాబడులు రాకపోవడంతో బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. 1.6 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశబెట్టబోతున్నట్టు సమాచారం. 

కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించింది. అటు ఎన్నికల హామీలు నెరవేర్చే విధంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించామంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.

2010 విధివిధానాల ప్రకారమే కేంద్రం NPR చేపట్టాలని సభలో తీర్మానం చేయనున్నట్టు సమాచారం. సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని గతంలో సీఎం కేసిఆర్ ప్రకటన చేశారు. దీనిపై కూడా సభలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ తుది నిర్ణయం తీసుకోనుంది. 14 లేదా 15 పనిదినాలు  ఉభయ సభలు జరిగే  అవకాశం ఉంది.

కరోనా అంశం కూడా అసెంబ్లీ సమావేశాలపై  ఏమైనా ప్రభావం చూపిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు  కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో కందిరైతులు పడుతున్న ఇబ్బందులను సభలో లేవనెత్తుతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్‌ తెలిపారు.

రైతులకు రుణమాఫీ, రైతు బంధు సాయం అందించకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించడంపై అసెంబ్లీలో నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు. అటు కాంగ్రెస్‌, బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైంది.

See Also | మెట్రో రైలులో ఆన్ లైన్ టికెట్లు: కరోనా గురించి భయం వద్దు