ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్ల కోర్కెలు విని బిత్తరపోతున్న బీజేపీ నేతలు

  • Published By: naveen ,Published On : July 15, 2020 / 12:04 PM IST
ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్ల కోర్కెలు విని బిత్తరపోతున్న బీజేపీ నేతలు

ఎన్నెన్నో అనుకుంటాం.. అవన్నీ జరుగాతాయా ఏంది..? సర్లే అని సర్దుకుపోతున్నారు కమలం గూటికి చేరిన పెద్ద తలకాయలు. పెద్ద పదవిని ఆశించి బొక్కబోర్లా పడ్డ నేతలంతా ఇప్పుడు గమ్మున ఉండిపోయారు. ఆ ఒక్కటి కాకుండా ఇంకేం పదవి కావాలన్నా ఇస్తామని బీజేపీ పెద్దలు ఆఫర్లిస్తున్నా, అబ్బే అవేం వద్దండి బాబూ అని సుతిమెత్తగా తిరస్కరిస్తున్నారట. అంతేకాదు స్టేట్‌ లెవెల్లో కాకుండా జాతీయ కార్యవర్గంలో ఛాన్స్ ఇవ్వాలని గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారట. ఇంతకీ బీజేపీలో చేరిన ఇతర పార్టీల సీనియర్ నేతలు ఏం ఆశించారు..? ఇప్పుడేం డిమాండ్లు పెడుతున్నారు..?

తెలంగాణ బీజేపీ చీఫ్ కావాలని కలలు:
కాంగ్రెస్‌ నుంచి డీకే అరుణ, టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీలు వివేక్‌, జితేందర్‌ రెడ్డి.. టీడీపీ నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతర పార్టీల్లోంచి బయటికొచ్చి కాషాయం కండువా కప్పుకున్న వాళ్ల లిస్ట్ పెద్దగానే ఉంటుంది. వీళ్లంతా తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కావాలని కలలు గన్నారు. పార్టీలో చేరే ముందు ఎలాంటి కండీషన్స్‌ పెట్టకపోయినా పరోక్షంగా వీళ్ల టార్గెట్‌ మాత్రం అదేనని క్లియర్‌ కట్‌గా తెలుస్తోంది. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం వీళ్లెవర్నీ లెక్కలోకి తీసుకోలేదు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకే పట్టం కట్టింది. దీంతో భారీ ఆశలు పెట్టుకున్న పెద్ద తలకాయలంతా డిసప్పాయింట్ అయ్యారు.

చిన్న చిన్న పదవులు వద్దని తెగేసి చెబుతున్నారు:
అధ్యక్ష బాధ్యతల అప్పగింత అయిపోయింది. అది ముగిసిన అధ్యాయం. ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు రాష్ట్ర కమిటీ పదవుల పంపకం మొదలైంది. పేరున్న పెద్ద నేతలను సంప్రదిస్తూ మీకేం కావాలో చెప్పండి.. ఇచ్చేస్తామని కమలం పెద్దలు ఆఫర్‌ చేస్తున్నారు. కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్‌ లీడర్లు అందుకు అంగీకరించడం లేదని కాషాయం నేతల్లో చర్చ జరుగుతోంది. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ నేతకు ప్రధాన కార్యదర్శి పదవి ఆఫర్ చేస్తే వద్దని చెప్పేశాడట. ఇస్తే గిస్తే ప్రెసిడెంట్‌ గిరి లేదంటే నేషనల్‌ లెవెల్ లో అకామిడేట్ చేయండని అన్నారట. దక్షిణ తెలంగాణ మాజీ మంత్రి కూడా అదే సమాధానం చెప్పారట. నల్గొండకు చెందిన నేత అయితే తనకన్నా చిన్న వాడి దగ్గర నేనెలా పని చేసేదని మొహమాటం లేకుండానే చెప్పేశాడట. ఇక మహబూబ్ నగర్ మాజీ ఎంపీ గతంలో పార్లమెంట్ పక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉందని.. ఆ స్థాయిలో పదవి ఇస్తే తీసుకునేందుకు సిద్ధమన్నారట. గరికపాటి మోహన్‌ రావు మాత్రం తనకు ఏ పదవీ అక్కర్లేదని.. వెంట వచ్చిన వారికి మాత్రం న్యాయం చేయండని రిక్వెస్ట్ పెట్టారట.

ఒక్కో నేత ఒక్కో రకమైన షరతులు పెడుతుండడం బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఏవేవో ఆశించి పార్టీలోకి వచ్చిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వాలి..? ఎలా సంతోష పరచాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు.