తెలంగాణ బడ్జెట్ : ఆర్టీసీకి రూ. 1000 కోట్లు, రిటైర్‌మెంట్‌ వయస్సు పెంపు

  • Published By: madhu ,Published On : March 8, 2020 / 08:01 AM IST
తెలంగాణ బడ్జెట్ : ఆర్టీసీకి రూ. 1000 కోట్లు, రిటైర్‌మెంట్‌ వయస్సు పెంపు

తెలంగాణ ఆర్టీసీ విషయంలో చెప్పినట్లుగానే నిధులు కేటాయిస్తోంది ప్రభుత్వం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1000 కోట్లు కేటాయించింది. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం తెలంగాణ వార్షిక బడ్జెట్‌‌ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా..వివిధ రంగాలకు నిధులు కేటాయింపు వివరాలను ఆయన వెల్లడించారు. అందులో ప్రధానమైంది ఆర్టీసీ. ఈ సంస్థకు వేయి కోట్లను కేటాయిస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే.

అందుకనుగుణంగానే..బడ్జెట్‌లో ఈ నిధులను కేటాయించారు. అంతేగాకుండా..రిటైర్ మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికై బోర్డు ఏర్పాటు చేస్తామని సభలో వెల్లడించారు. 

ఇటీవలే ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘంగా 52 రోజలు పాటు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి..పలు చర్యలు తీసుకున్నారు. ప్రతి ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ. 1000 కోట్లు కేటాయించనున్నట్లు, నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని సూచించారు. ప్రత్యేకంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని కూడా తాము అందిస్తామని, ఏ ఒక్క కార్మికుడిని కూడా తీసివేయమని హామీనిచ్చారు. సమ్మె సందర్భంగా చనిపోయిన కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఆర్టీసీ మహిళా కార్మికుల విషయంలో కూడా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రసూతి సెలవులు మంజూరు చేయడంతో పాటు..రాత్రి 8 గంటలకు విధులు ముగిసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. 

Read More : తెలంగాణ బడ్జెట్ : 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ – హరీష్ రావు