CM KCR Audio : ఈటలతో అయ్యేది కాదు, పొయ్యేది కాదు.. వైరల్ అవుతున్న కేసీఆర్ ఆడియో

10TV Telugu News

CM KCR Audio : హుజూరాబాద్‌ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని తనుగుల గ్రామ ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామికి కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. దళితబంధు పథకం గురించి ఫోన్‌లో ప్రస్తావించారు. అన్ని గ్రామాలకు దళితబంధు పథకం గురించి తెలియాలన్నారు. దళితబంధు మంచి పథకమని, ఈ పథకం ద్వారా ఒక్క హుజూరాబాదే కాదు రాష్ట్రంలోని దళితులంతా బాగుపడతారన్నారు. దళితబంధు దేశంతో పాటు యావత్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు సీఎం కేసీఆర్‌.

ఇక ఇదే ఫోన్‌ సంభాషణలో మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై మాటల తూటాలు పేల్చారు సీఎం కేసీఆర్. తన ముందు ఈటల చాలా చిన్నోడన్న కేసీఆర్.. ఈటలతో అయ్యేది కాదు పోయేది కాదని అన్నారు. అసలు ఈటలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నారు. ప్రస్తుతం ఈ ఆడియో టేప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం దళితబంధు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 100 మంది దళితులను ఎంపిక చేసి వారికి స్వయం ఉపాధి కోసం రూ.10 లక్షలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దళితుల కోసం ఇంత భారీ ఎత్తున ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం చేపట్టలేదని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ పథకం పేద దళితుల జీవితాలను మారుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది సర్కార్. అక్కడ పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. దీంతో ఆ నియోజవర్గంలో రూ.2 వేల కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళితబంధు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందని వారికి ఈ దళిత బంధు పథకంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కేటగిరీల వారీగా అర్హులను ఎంపిక చేయాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది.

హుజూరాబాద్ నియోజవర్గంలో ఈ పథాకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిన తర్వాత దీన్ని రాష్ట్రమంతటా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందు కోసం రూ.1200 కోట్లను కేటాయించినట్లు ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. మొద‌టి ద‌శ‌లో ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున‌ రాష్ట్ర‌వ్యాప్తంగా 11,900 కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. మధ్యవర్తులతో ప్రేమయం లేకుండా.. రైతుబంధు ప‌థ‌కం మాదిరిగానే నేరుగా ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను సర్కార్ జమ చేయనుంది. మొదటి దశలో కొంత లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసి వారి ఖాతాల్లో నేరుగా డబ్బును జమచేస్తారు.

10TV Telugu News