పీసీసీ చీఫ్ ఎవరో ప్రకటించేలోపే.. కాంగ్రెస్ కొంప ముంచిన కరోనా!

  • Published By: sreehari ,Published On : March 26, 2020 / 09:49 AM IST
పీసీసీ చీఫ్ ఎవరో ప్రకటించేలోపే.. కాంగ్రెస్ కొంప ముంచిన కరోనా!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఇక ప్రకటించడమే మిగిలింది. ఇంతలో కరోనా వైరస్ వచ్చి తన్నుకుపోయింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరో డిసైడ్‌ చేసే సమయానికి నిలిచిపోయింది. పీసీసీ చీఫ్ ఆశిస్తున్న వారంతా తమ తమ కేడర్‌ను రెడీ చేసేసుకున్నారు. అధిష్టానం ప్రకటించడమే తరువాయి.. తమ బలాన్ని చూపించేసుకుందామని అన్నీ సిద్ధం చేసేసుకున్నారు. తీరా కరోనా వచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లింది. పార్టీ ఢిల్లీ పెద్దలు తెలంగాణ పీసీసీ ఎన్నికకు చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చేసిందనే ప్రచారం జరగడంతో ఆశావహులు అన్ని ఆర్భాటాలతో రెడీ అయిపోయారు.  

అయోమయంలో ఆశావహులు : 
ఇటీవల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపిక సందర్భంగా జరిగిన అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లు ఆధారంగా ఆశావహులంతా ఇక ప్రకటన గ్యారంటీ అని భావించారు. కాకపోతే పోటీ పడుతున్న వారిలో ఎవరికి చాన్స్‌ వస్తుందా అనే అనుమానాలు మాత్రం వ్యక్తమయ్యాయి. తమకున్న పరపతి పరిచయాలను ఉపయోగించుకుంటున్నారు. సీల్డ్ కవర్‌లో ఎవరి పేరుందో తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొన్నటి వరకూ పార్లమెంట్ సమావేశాలు, మధ్యప్రదేశ్ సంక్షోభం, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి అరెస్ట్ లాంటి అంశాలతో టీపీసీసీ చీఫ్‌ ప్రకటనలో ఏఐసీసీ కాస్తా ఆలస్యం చేసింది అనేది సీనియర్లు అభిప్రాయం. ప్రస్తుతం అన్ని సమస్యలు తీరి, ఇక అధ్యక్షుడు ఎవరో ప్రకటించేస్తారని అనుకున్న సమయంలో కరోనా దెబ్బ కొట్టేసిందని వాపోతున్నారు.  

కరోనా వ్యాప్తితో పీసీసీ చీఫ్ ప్రకటన వాయిదా :
కరోనా వ్యాప్తి భయాందోళనలు సృష్టిస్తోన్న నేపథ్యంలో ప్రకటన వాయిదా పడింది. ఇది ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. పరిస్థితి చూస్తే మరింత ఉధృతంగా మారేలా ఉండడంతో మరికొంత కాలం ఆశావహులు వేచి చూడక తప్పేలా లేదు. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శల పాలవ్వడం ఎందుకనే ఉద్దేశంతో ఏఐసీసీ పెద్దలు సైలెంట్‌ అయిపోయారు. ఇప్పటికే పైరవీలు చేసుకున్న వారి శ్రమంతా వృథా అయ్యిందనే భావనలో ఉన్నారు. ఏం చేయాలో తెలియక కేడర్ దగ్గర భోరుమంటున్నారు. పీసీసీ పదవి వస్తే పార్టీని గుప్పెట్లో పెట్టేసుకుందామని ఆశపడ్డవారంతా కరోనా వచ్చి మా కొంప ముంచిందని ఫీలైపోతున్నారు. 

ఇళ్లకే పరిమితమైన నేతలు :
పరిస్థితులు సద్దుమణిగాక అయినా తమ పేరు ఉంటుందో లేదో తెలియని అయోమయంలో అప్పటి వరకూ మళ్లీ ఎదురు చూడాల్సిందేనంటున్నారు. అప్పటి పరిస్థితులకు తగ్గట్టు సీల్డ్‌ కవర్‌లో పేరు పక్కన పెట్టేసి కొత్త పేరు ప్రకటించరనే గ్యారెంటీ కూడా లేదని అనుకుంటున్నారు. ఎవరిని ఫైనల్‌ చేసిందో తెలియదు గానీ.. ఎవరికి వారు తామే నెక్స్ట్‌ అంటూ కార్యకర్తల దగ్గర బిల్డప్పులిస్తూ సంబరాలకు రెడీ అయిపొమ్మన్నారు. తీరా… పరిస్థితులు తారుమారైపోవడంతో అన్నీ మూసుకొని ఇళ్లకే పరిమితం అయిపోయినట్టుగా కనిపిస్తోంది. 

Also Read | కరోనా రిలీఫ్ ప్యాకేజీ : వచ్చే 3 నెలలు EPF మొత్తాన్ని చెల్లిస్తాం.. కేంద్రం