సుజనా అమెరికా ప్రయాణానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్

  • Published By: murthy ,Published On : November 14, 2020 / 10:12 AM IST
సుజనా అమెరికా ప్రయాణానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్

HC permits sujana chowdary to fly abroad : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి 2వారాల పాటు అమెరికా వెళ్లేందుకు తెలంగాణ హై కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ గతంలో జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల కారణంగా ఆయన విదేశీ ప్రయణాన్ని అడ్డుకోవద్దని ఇమ్మిగ్రేషన్ అధికారులకు కోర్టు స్పష్టం చేసింది. న్యూయార్క్ లో అనారోగ్యంతో ఉన్న తన మామను చూసేందుకు సుజనా చౌదరి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా ఇమ్మిగ్రేషన్ అధికారులు శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డుకున్నారు.

దీంతో తనపై ఉన్న లుకౌట్ నోటీసులను సవాల్ చేస్తూ…తనను అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ సుజనా చౌదరి శుక్రవారం అత్యవసర పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ చల్లా కోదండరాం ఇంటి వద్ద విచారించారు. సుజనా చౌదరి తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మెసర్స్‌ బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని.. మరో కేసులో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారని తెలిపారు.



ఈ రెండు కేసుల్లోనూ ఎలాంటి దుందుడుకు చర్యలూ తీసుకోవద్దని కోర్టులు ఆదేశాలిచ్చాయని తెలిపారు. సుజనాపై ఎటువంటి క్రిమినల్‌ కేసులూ లేవని.. సీబీఐ నమోదు చేసిన కేసులో విచారణకు సహకరిస్తున్నారని తెలిపారు. సీబీఐ, కేంద్రం తరుఫు న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం పిటీషనర్ ఎంపీ అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని రెండు వారాలపాటు అమెరికా వెళ్లేందుకు అనుమతించినట్లు న్యాయమూర్తి పేర్కోన్నారు. గడువు లోగా తిరిగి రావాలని, వచ్చిన వెంటనే ఇమ్మిగ్రేషన్ శాఖకు, సీబీఐ కు సమాచారం ఇస్తాననే హామీ ఇవ్వాలని న్యాయమూర్తి షరతు విధించారు.

కాగా..బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన సంస్ధల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గతంలో జరిపిన భారీ సోదాల్లో పలు షెల్ కంపెనీలను గుర్తించారు. సుజనా చౌదరికి చెందిన గ్రూపు సంస్ధలు బ్యాంకులను రూ.5,700 కోట్ల మేర మోసం చేశాయని ఆరోపించింది.