నా కల నిజమైంది : కరువు జిల్లా పాలుగారే జిల్లాగా మారింది

  • Published By: chvmurthy ,Published On : December 30, 2019 / 12:14 PM IST
నా కల నిజమైంది : కరువు జిల్లా పాలుగారే జిల్లాగా మారింది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరువు జిల్లాగా ఉన్న కరీంనగర్ జిల్లాను పాలుగారే జిల్లాగా చేయాలన్న నాకల నిజమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జీవనది గోదావరిపారే కరీంనగర్ జిల్లాలో గతపాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు వలసలు వెళ్లారని…సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని…జిల్లాకు ఇకనుంచి ఆ పరిస్ధితే లేదని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి దాని కింది నిర్మించిన లక్ష్మి, సరస్వతి, పార్వతి బ్యారేజిలు, శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజిలో 365రోజుల్లో నీరు పారతూ సుమారు 140 కిలోమీటర్ల మేర సజీవంగా ఉంటుందని దీనివల్ల రైతులు రెండు పంటలు వేసుకోచ్చని ఆయన అన్నారు. దీంతో ఈ  ప్రాంతానికి శాశ్వతంగా కరువు పీడ తొలిగిపోయింది.

మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలలో 110 టీఎంసీల నీరు ఉందని ఇందులో 90 టీఎంసీలు నీరు ఉపయోగించుకోవచ్చని కేసీఆర్ వివరించారు. వర్షాలు పడకపోయినా రైతులు 2పంటలువేసుకుని పంటలు పండించుకోవచ్చని ఆయన భరోసా ఇచ్చారు. 2001 లో జరిగిన తొలిసంహగర్జన సభలోనే చెప్పానని తెలంగాణ సాకారమైతే  ఈ జిల్లారూపు రేఖలు మారిపోతాయని ఆకల నేడు నిజమైందని ఆయన ఉద్వేగంగా చెప్పారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం  ఇరిగేషన్  ప్రాజెక్టులకు అధిక  ప్రధాన్యం ఇచ్చిందని, విపక్షాలు  నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గోదావరి ఒడ్డున ఉన్న జిల్లాలు సంపూర్ణమైన వివక్షకు గురయ్యాయని… వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌, కరీంనగర్‌, నిర్మల్‌ ఏరియాల్లో కరువు ఉండకూడదు. కాని తీవ్ర వివక్ష కారణంగా ఈ జిల్లాలు కరువుతో అల్లాడిపోయాయన్నారు.

తెలంగాణ రాష్ట్రం సాకారమైతే గోదావరి డేల్టాకంటే అద్భుతంగా ఉంటాయని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మిడ్‌ మానేరు ప్రాజెక్టు మీద నిలుచొని పూజ చేస్తున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. జీవితంలో సఫలత్వం కలిగినట్లు అనుభూతి కలిగిందని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న బాధ్యత రాష్ట్రం మీద ఇతర ఏ పార్టీలకు ఉండదు.

మొత్తం రాష్ర్టానికి ఏం కావాల్నో టీఆర్‌ఎస్‌ పార్టీకి తెలిసినంతా ఆయా జిల్లాల్లో ఉన్న సీనియర్‌ నాయకులకు కూడా తెలియదు. రాష్ట్రవ్యాప్తంగా 1230 చెక్‌డ్యాంలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అందులో సింహభాగం కరీంనగర్‌ జిల్లాలోనే ఉన్నాయి. రూ.1250 కోట్లతో కరీంనగర్‌ జిల్లాలో రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని, మానేరు రివర్‌పై 29 చెక్‌డ్యాంలు, మూలవాగుపై 10 చెక్‌డ్యాంలు నిర్మించేందుకు టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేశాం. నీళ్లు వృధా పోకుండా జూన్‌లోగా ఈ చెక్‌డ్యాంలు నిండాలని ఆదేశించాం అని కేసీఆర్ చెప్పారు. 

కరీంనగర్ జిల్లాలో ఎన్నివాగులున్నాయోకూడా తెలుసు కోకుండా కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. జిల్లాలోని 46 వాగులపై చెక్ డ్యాంలు నిర్మించటానికి ప్రజాప్రతినిధులు ఇంజనీర్లతో సమన్వయం చేసుకుని జూన్ కల్లా పూర్తి చేయించాలని సీఎం ఆదేశించారు. అందుకు అవసరమైన రూ,1230 కోట్లను  ప్రత్యేకంగా విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

జూన్ తర్వాత కరీంనగర్ జిల్లా టూరిజం అభివృధ్దిలోనూ ముందుంటుందని ఆయన చెప్పారు. పాపికొండలు వద్ద గోదావరి నది ఎలా పయనిస్తుందో కరీంనగర్ జిల్లాలోనూ గోదావరి నది అంత అందంగా ప్రవహిస్తుందని….సిరిసిల్ల కొండలు అంత అందంగా కనిపిస్తున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత లండన్ లోని ధేమ్స్ నదిలా కరీంనగర్ లో గోదావరి ప్రవహిస్తూ గొప్ప టూరిజం స్పాట్ గా మారబోతోందని కేసీఆర్ చెప్పారు.