తిరుపతి ఉపఎన్నిక వైసీపీ అభ్యర్థిగా జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి?

  • Published By: naveen ,Published On : November 20, 2020 / 12:39 PM IST
తిరుపతి ఉపఎన్నిక వైసీపీ అభ్యర్థిగా జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి?

tirupati byelection ysrcp candidate doctor guru murthy: తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు తమ అభ్యర్థిని ప్రకటించారు. పనబాక లక్ష్మి పేరుని చంద్రబాబు అనౌన్స్ చేశారు. ఇప్పుడు వైసీపీ కూడా అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా కొత్త వారికి చాన్స్ ఇవ్వనున్నారు సీఎం జగన్.

డాక్టర్ గురుమూర్తి పేరుని జగన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాసేపట్లో ఈ విషయాన్ని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రకటించనున్నారు. డాక్టర్ గురుమూర్తి సీఎం జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్. జగన్ సుదీర్ఘ పాదయాత్ర సమయంలో గురుమూర్తి జగన్ వెన్నంటి ఉన్నారు. కాగా, దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

సీఎం జగన్ తమ కుటుంబానికి అండగా నిలిచారని దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చెప్పారు. తిరుపలి లోక్ సభ ఉపఎన్నికల అభ్యర్థిపై సీఎం జగన్ తమ అభిప్రాయం అడిగారని చెప్పారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం జగన్ చెప్పారని కళ్యాణ్ తెలిపారు. నాన్నగారి మరణం మమ్మల్ని కుంగదీసిందని కళ్యాణ్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎన్నికల్లో పోటీ చేయలేము అన్నారు.

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో తిరుపతి లోక్ సభకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఖాళీగా ఉన్న తిరుపతి ఎంపీ సీటును ఎన్నికల సంఘం నోటిఫై చేసినప్పటికీ, ఇంకా బైపోల్ ప్రకటన రాలేదు. ఈలోపు పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో మునిగిపోగా.. టీడీపీ మాత్రం పేరును ఖరారు చేసి ఎన్నికలను రసవత్తరంగా మార్చింది. అందరికన్నా ముందుగా టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించింది.
https://10tv.in/is-janasena-leader-nadendla-manohar-going-to-join-bjp/
బీజేపీకి చెక్ చెప్పిన చంద్రబాబు:
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును చంద్రబాబు ఖరారు చేశారు. తిరుపతి సీటును ఈసీ నోటిఫై చేసినప్పటి నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాల్లో పనబాకకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎస్సీ రిజర్వ్ డ్ స్థానమైన తిరుపతిలో పాపులర్ నేతల్ని వెతుక్కోవడం బీజేపీకి కష్టంగా మారిందని, దాంతో మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ నాయకురాలు పనబాక లక్షి వైపు కమలనాథులు మొగ్గుచూపుతున్నారని, ఆమెతో టీడీపీకి రాజీనామా చేయించి, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించేలా నేతలు మంత్రాంగం నడుపుతున్నారని జోరుగా వార్తలొచ్చాయి. అందులో నిజానిజాలు ఎంతో ఎన్నికల నాటికి తేలతాయని భావించేలోపే.. చంద్రబాబు.. పనబాక పేరును టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టగలిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, 2019 ఎన్నిక‌ల్లోనూ టీడీపీ త‌రపున పోటీ చేసి ఓట‌మి పొందారు ప‌న‌బాక ల‌క్ష్మి.

ముందుగానే అలర్ట్ అయిన చంద్రబాబు:
చంద్రబాబు అందరికంటే ముందుగా అప్రమత్తం అయ్యారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ విధానాలను తీవ్రంగా ఎండగడుతున్న చంద్రబాబు తిరుపతి బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి చెందిన పార్టీ నేతలతో చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ఎన్నికలో టీడీపీ గెలుపునకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో తిరుపతి బైపోల్ అభ్యర్థిని కూడా ప్రకటించేశారు.

త్వరలోనే షెడ్యూల్:
ఇటీవల బీహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికలతోపాటే ఖాళీగా ఉన్న ఒక లోక్ సభ(వాల్మికి నగర్-బీహార్) సీటుకు, 11 రాష్ట్రాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. వాటితో పాటే మరో 4 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నా, వివిధ కారణాలతో అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. గడువు ముంచుకొస్తుండటంతో కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాంలోని ఏడు అసెంబ్లీ సీట్లకు ఈసీ త్వరలోనే షెడ్యూల్ ప్రకటించనుంది. వీటితోపాటే ఖాళీ స్థానాలుగా నోటిఫై అయిన మూడు పార్లమెంట్ సీట్లకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్రణాళికలు వేస్తోంది. కర్ణాటకలో కేంద్ర మంత్రి సురేశ్ అంగడి మరణంతో ఖాళీ అయిన బెల్గాం, కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ మరణంతో కన్యాకుమారి స్థానం, వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతితో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ ముగ్గురూ కరోనా కాటుకు బలైనవారే కావడం విచారకరం.