అన్ని మనమే గెలవాలి : TRSలో మంత్రులకు పరీక్ష!

  • Published By: sreehari ,Published On : January 14, 2020 / 12:37 PM IST
అన్ని మనమే గెలవాలి : TRSలో మంత్రులకు పరీక్ష!

తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలను గెలుచుకోవాలన్నదే అధికార టీఆర్ఎస్‌ పార్టీ లక్ష్యం. ఇందుకోసమే వ్యూహాలను రచించడంలో పార్టీ పెద్దలు తలమునకలయ్యారు. పార్టీని గెలిపించే బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించింది అధిష్టానం. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పురపాలికలను కైవసం చేసుకునేందుకు వీలుగా పావులు కదుపుతోంది. నియోజకవర్గంలో స్థానికంగా ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగిస్తూనే జిల్లా స్థాయిలో మంత్రులు కూడా బాధ్యతలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా గులాబీ జెండా ఎగరాలని మంత్రులకు టార్గెట్ పెట్టారు.

నియోజకవర్గాల్లోనే నేతల మకాం :
అధిష్టానం ఆదేశానుసారం మంత్రులంతా ఎన్నికలయ్యే వరకు తమ నియోజకవర్గంతో పాటు తమ పరిధిలోని మున్సిపాలిటీలకే పరిమితం కావాలని నిర్ణయం తీసుకున్నారట. పార్టీ అభ్యర్థుల విజయం కోసం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయంగా పావులు కదుపుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి తమ నియోజకవర్గాలకు అమాత్యులు మకాం మార్చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపోటములపైనే తాము పదవుల్లో కొనసాగుతామా? లేదా అన్నది డిసైడ్‌ అవుతుందనే ఉద్దేశంతో ఈ పరీక్ష నుంచి ఎలా గట్టెక్కాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

లేదంటే.. పదవికి ఎసరని :
ఉమ్మడి జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ మాత్రం తేడా వచ్చినా పదవికి ఎసరు తప్పదనే ఆందోళనలో మంత్రులు ఉన్నారట. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పని చేస్తేనే పార్టీ ఆశించిన ఫలితాలు వస్తాయని కేసీఆర్‌ తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలతో పాటు 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్‌లతో పాటు రంగారెడ్డి జిల్లాలోని కార్పొరేషన్ల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి చెందినందుకు మంత్రులు మాగంటి బాబు, మారేపల్లి అప్పట్లో మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన అంశాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దీంతో మంత్రులంతా పూర్తి స్థాయిలో ఎన్నికల పైనే దృష్టిని పెట్టి సర్వశక్తులు ఒడ్డుతున్నారట. తేడా వస్తే పదవి పోతుందనే ఆందోళన వారిలో కనిపిస్తోందంటున్నారు. మరి మున్సిపాలిటీ ఎన్నికలు మంత్రులకు ఎలాంటి అనుభవాలను మిగుల్చుతుందో వేచి చూడాల్సిందే.