ఆ ఎమ్మెల్సీ పదవి ఎన్నికపై అధికార పార్టీ నేతల్లో ఆశలు!

  • Edited By: sreehari , July 8, 2020 / 08:08 AM IST
ఆ ఎమ్మెల్సీ పదవి ఎన్నికపై అధికార పార్టీ నేతల్లో ఆశలు!

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి కోసం ఎన్నిక ఎప్పుడు జరుగుతుందా? అని అధికార పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డిని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హుడిగా ప్రకటించడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ఈ ఎమ్మెల్సీ పోస్టు కాలపరిమితి 6 ఏళ్లు. ఏప్రిల్ 7వ తేదీన ఉప ఎన్నిక జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం.. ఎన్నిక జరిగితే ఈ పాటికి రాజకీయ సందడి పూర్తిగా సద్దుమణిగేదే. కానీ, కరోనా ప్రభావంతో ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది.

ఏప్రిల్ వరకు 15 నెలల పాటు ఖాళీగా ఉన్న ఈ స్థానం తాజాగా మరో 4 నెలల పాటు అలాగే ఉంటుంది. అంటే, సుమారు ఏడాదిన్నర పాటు అందరినీ ఊరిస్తూ వస్తోంది. వీలైనంత త్వరగా మాజీ ఎంపీ కవిత మళ్లీ క్రియాశీలకంగా పని చేయాలని గులాబీ దళం ఆశిస్తోంది.

జిల్లాలో గాడితప్పిన పార్టీ వ్యవస్థకు పగ్గాలు దారిలో పెట్టేందుకు కవిత రంగంలోకి దిగాలని ఆరాటపడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఓ స్థాయి నాయకుల ఆగడాలకు కళ్ళెం వేయాలని భావిస్తున్నారు. కవిత కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. ప్రత్యేక వ్యూహంతో ఇందూరు గడ్డపై మళ్లీ పాగా వేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీనికోసం తరచూ జిల్లాకు వచ్చి వెళ్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓటమి తర్వాత పార్టీలో ఒక్కసారిగా నిస్తేజం ఏర్పడింది. కవిత ఓటమికి పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని తేల్చారు. ఆ తర్వాత కవిత చాలా కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా జిల్లాలోకి అడుగు పెట్టాలని చూస్తున్నారు.

అందుకే ప్రత్యర్థి పార్టీ నేతల కదలికలు, వారి రాజకీయ వ్యవహారాలపై నిఘా పెట్టారు. పోయిన చోటే వెతుక్కోవాలన్న ఉద్దేశంతో ఎంపీగా ఓడిపోయిన నిజామాబాద్‌లో శాసనమండలి సభ్యురాలిగా మళ్లీ చక్రం తిప్పేందుకు కవిత ఆరాట పడుతున్నారు. దీనంతటికీ ప్రస్తుతం కరోనా అడ్డంకిగా మారింది. దీంతో ఆమె సన్నిహితుల్లో టెన్షన్‌ పెరుగుతోందట.

పార్టీలో పెత్తనం చలాయించే వారికి కళ్లెం వేయాలని కోరుకుంటున్న వారు ఈ జాప్యాన్ని తట్టుకోలేకపోతున్నారట. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతల ఆశలు తీరే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ఆలస్యం అవుతుండడంతో మరో ఏడాదిన్నర పాటే ఈ పదవిలో ఉండే చాన్స్‌ ఉంది. మొదట్లో మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్ రెడ్డి పోటీ చేస్తారని భావించారు. అయితే, ఆయన ఇంత తక్కువ పదవీకాలం కావడంతో వెనక్కి తగ్గారు.

చివరి క్షణాల్లో నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పేరును ఖరారు చేయడంతో పార్టీలో కొత్త జోష్‌ వచ్చింది. కవిత ఓటమి తర్వాత పార్టీ వ్యవహారాలను ఎవరూ పట్టించుకోలేదు. నాయకులంతా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వచ్చారు. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కవిత రీ ఎంట్రీతో మళ్లీ పరిస్థితులు సర్దుకుంటాయని కేడర్‌ సంబరపడుతున్న సమయంలో కరోనాతో ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.