బ్రేకప్.. ఆ ఇద్దరి నేతల మధ్య ఎన్నికల చిచ్చు!

  • Published By: sreehari ,Published On : January 16, 2020 / 01:54 PM IST
బ్రేకప్.. ఆ ఇద్దరి నేతల మధ్య ఎన్నికల చిచ్చు!

‌రెండోసారి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డికి మంత్రి వర్గంలో అవకాశం ఇచ్చారు కేసిఆర్. తొలి ప్రభుత్వంలో కేబినెట్‌లో ఇంద్రకరణ్‌, జోగు రామన్న మంత్రులుగా ఉండేవారు. కానీ రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్‌రెడ్డికి మాత్రమే అవకాశం వచ్చింది. మొత్తం పది నియోజకవర్గాలలో ఒకే ఒక్క మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సాధారణంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తమ ఆధిపత్యాన్ని చూపిస్తూ ముందుకెళ్తారు. కానీ, ఇంద్రకరణ్ మాత్రం ఇప్పటి వరకూ సిర్పూర్‌ నియోజకవర్గంలోకి ఒక్కసారి కూడా అడుగుపెట్టలేదట. ఇప్పుడిదే జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

25ఏళ్ల బంధానికి బ్రేక్ :
తెలంగాణ రాష్ట్రంలో తొలి నియోజకవర్గం సిర్పూర్‌. పైగా మంత్రి ఇంద్రకరణ్‌కు అత్యంత సన్నిహితుడు, శిష్యుడైన కోనేరు కోనప్ప అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ, ఇప్పుడు మంత్రి, ఎమ్మెల్యేకు పొసగడం లేదంటున్నారు పార్టీ కార్యకర్తలు. ఇద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇంద్రకరణ్‌రెడ్డి ఏ పార్టీలో ఉంటే అదే పార్టీలోకి వెళ్లేవారు కోనేరు కోనప్ప. 25 ఏళ్ల స్నేహబంధానికి ఇప్పుడు బ్రేకులు పడ్డాయంట. 2014లో వీరిద్దరు బీఎస్పీ తరఫున పోటీ చేసి గెలిచారు.

ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లోలో మళ్లీ ఇద్దరూ గెలిచారు. మరోసారి ఇంద్రకరణ్‌ మంత్రి అయ్యారు. అప్పటి వరకూ ఇద్దరి మధ్య సఖ్యత ఉంది. కానీ, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలు ఇద్దరి మధ్య చిచ్చు రేపిందంటారు. ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీరిద్దరి సెగ్మెంట్లు అందులోకే వస్తాయి. ఆ ఎన్నికలలో మాజీ ఎంపీ జి.నగేశ్‌కు మరోసారి టిక్కెట్ దక్కింది. కానీ, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు గెలిచారు.

కోనప్ప క్రేజ్ తగ్గించాలనే:
మంత్రితో పాటు అన్ని నియోజవకర్గాల్లో బీజేపీకి మెజారిటీ రాగా.. కోనప్ప నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్‌కు ఆధిక్యం దక్కింది. ఈ టైమ్‌లో కోనప్పకు మంత్రి పదవి గ్యారెంటీ అనే ప్రచారం సాగింది. ఇక అప్పటి నుంచి కోనప్పను తక్కువ చేస్తూ.. ఆయన క్రేజ్‌ను తగ్గించేందుకు ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పోడు భూముల వ్యవసాయం విషయంలో కోనప్ప సోదరులపై కేసు నమోదైంది.

దీని వెనుక ఇంద్రకరణ్ ఉన్నారన్నది కోనప్ప భావన. అప్పటి నుంచి వీరి మధ్య వైరం మొదలైందంట. ఐటీడీఏ సమావేశంలో మంత్రిపై కోనప్ప ప్రత్యక్షంగానే మాటల దాడి చేశారంట. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిపోయినట్టేనని పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఈ కారణంగానే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సిర్పూర్‌ నియోజకవర్గానికి రావడం లేదని చెబుతున్నారు.