బస్తీ మే సవాల్ : పురపోరుకు TRS సై..క్లీన్ స్వీప్ లక్ష్యం

  • Published By: madhu ,Published On : December 29, 2019 / 11:48 AM IST
బస్తీ మే సవాల్ : పురపోరుకు TRS సై..క్లీన్ స్వీప్ లక్ష్యం

మున్సిపల్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ రెడీ అవుతోంది. బస్తీ మే సవాల్ అంటోంది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని ఈ పార్టీ భావిస్తోంది. వార్డుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసిన టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమాగా ఉంది. మంత్రి కేటీఆర్ ఈ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్నారు.

అటు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే..ఇటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కార్యకర్తలకు సూచనలు, సలహాలు అందచేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు కూడా. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యహాలపై చర్చించారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు కావడంతో గ్రామీణ నేతలను వినియోగించుకోవాలని సూచించారు. వారికి వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. పురపాలక ఎన్నికల్లో గెలుపు తమదేనని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయన్నారు. 

కానీ రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాలేదు. దీంతో ముందుజాగ్రత్తగా అన్ని సామాజిక వర్గాల నుంచి అభ్యర్థులను గుర్తించాలని పార్టీ నేతలకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఇలా చేస్తే రిజర్వేషన్లు కేటాయించాక అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదని టీఆర్ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే కీలక ప్రాంతాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. త్వరలో క్యాంపెయిన్‌ షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు.

Read More : గెలిచేనా : టి. మున్సిపోల్..సై అంటున్న టీడీపీ